ఎవరు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అనే అమ్మ వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ ప్రతి విద్యార్థీ ఎదగడానికి కావలసిన పునాదిని మొగ్గ దశలోనే ఏర్పడేటట్లు చేయాలని ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు పేర్కొన్నారు. అమ్మ- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం అన్న, అమ్మ సూక్తికి అనుగుణంగా వారి అడుగు జాడలలో నడుస్తూ ప్రతి ఒక్క విద్యార్థీ ఎదగాలని కాంక్షించారు. 10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్ కమిటీ సభ్యులు బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సభ ప్రారంభంలో ఒక్కో విద్యార్థిని వారి తల్లిదండ్రులతో కలిసి వేదికపైకి రావాలని ఆహ్వానించారు. మనకు రెండురకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండు ఎలా జీవించాలో నేర్పేది. అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నామని బొప్పూడి రామబ్రహ్మం గారు తెలియజేశారు. విద్యార్ధినీ, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాలలో  ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ గారు దానికి స్పందిస్తూ పేరెంట్స్ సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.