ఐక్యభావన వల్లనే సమాజం పురోగమిస్తుందని ప్రభాకర స్వామి (హైదరాబాద్) వివరించారు. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సేవాభావం, పరస్పర సహకారం, త్యాగభావం వల్లే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కార వంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యమని ప్రబోధించారు. వైషమ్యాలు, విద్వేషాలు, దురాలోచనలు, హింస, స్వార్థం సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరించారు. మన సంస్కృతి, సమాజం గొప్పదనాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. భారతీయుల ఉత్తమ సంస్కృతి ప్రపంచాన్ని ఆకట్టుకుందని, అందువల్ల మన సంస్కృతి ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రబోధించారు. సత్సంప్రదాయాలను కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రభాకర స్వామివారి ప్రసంగం  విద్యార్థినీ విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుగుణగారు, ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.