లక్ష్య సాధనకోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్.మూర్తి వివరించారు. ఆగస్టు 13 వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. దేశాభ్యుదయం కోసం, మానవ మనుగడ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మహనీయులు అహర్నిశలు శ్రమించిన తీరు తెన్నులను వి.యస్.ఆర్. మూర్తిగారు సోదాహరణంగా వివరించారు. ఇదే వేదికపై విద్యార్థినీ విద్యార్థులను ఆహ్వానించి, వారి జీవిత లక్ష్యాలు ఏమిటి? అని ప్రశ్నించి జవాబులు రాబట్టటం అందరినీ అలరించింది. ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థినులు మనీషా, నాగలక్ష్మి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పి శ్రోతల మన్ననలు పొందారు.