జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం *ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ* అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం. హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు అధ్యక్ష భాషణను చేస్తూ పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నదని కనుక ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం అని తెలిపారు. జి. రాంబాబు గారు మాట్లాడుతూ 1972 నుండి జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా మనం గత ఐదు దశాబ్దాలుగా జరుపుకుంటున్నామని కనుక ఈ రోజున ప్రతిపాదించిన అంశాలను మనందరం ఆచరణలో పెట్టగలిగితేనే భావితరాల వారికి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు. అనంతరం కె. సత్యమూర్తి గారు మాట్లాడుతూ పర్యావరణానికి సంబంధించిన అధ్యయనాలు యూజీ స్థాయి విద్యార్థులకు 2005 నుండి అమలు పరచడం ముదావహమని అవి సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయని వివరించారు. డా. యల్. మృదుల గారు మాట్లాడుతూ ఏదైనా సందర్భంలో మనం ఒక చెట్టు నరకవలసి వస్తే పది చెట్లను నాటాలని అప్పుడే ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్ట వేయగలమని సూచించారు. ఎం. కవిత గారు ప్రసంగిస్తూ ప్రతి ఏడాది జరుపుకునే  పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం *ఎ సొల్యూషన్ టు ప్లాస్టిక్* అనే  Theam తో UNED సంస్థ ముందుకు వెళుతుందని తెలిపారు. ఆర్. వరప్రసాద్ గారు మానవున్ని అల్పాయుష్కునిగా చేయడంలో పర్యావరణం ప్రధాన పాత్ర వహిస్తుందని కలుషిత పర్యావరణంయ అనేది ప్రాణికోటి మనుగడకు ముప్పు తీసుకురాబోతుందని కనుక మనమంతా పర్యావరణాన్ని రక్షించడంలో మన వంతు కృషి చేయాలని చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నినాదాల తో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లెళ్ళమూడి గ్రామ ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ముందుకు సాగారు.