అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21.2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. అమ్మ భక్తులైన శ్రీ యమ్. చంద్రమోహన్ గారు పిడి (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మెడల్స్ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరు నుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణగారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.