అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభాకార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అయినాల మల్లేశ్వరరావు గారు గౌరవ అతిథి గా విచ్చేశారు. మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆంగ్లభాష ఉదరభాష మాతృభాష హృదయభాష అనీ, తల్లి ఒడిలో ఓనమాలు దిద్దిన వారు మాతృభాషను మరువరాదనీ అన్నారు. ఒక వ్యక్తి సంఘటిత శక్తి గా మారితే మాతృభాష పరిరక్షణ సుసాధ్యమని పలికారు. సహజకవి కావడంతో తమదైన శైలిలో సీస పద్యాలను ఆలపించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రష్ట్ సభ్యులు శ్రీ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భాషలకు సంబంధించిన ఉద్యమాలు గానీ భాషాబోధనలు కానీ టెక్నాలజీ తో కలిపి ముందుకు తీసుకువెళ్ళాలని అప్పుడే భాష గొప్పతనం అందరికీ చేరుతుందనీ సూచించారు.
సమైక్యభారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి. కన్నయ్య గారు మాట్లాడుతూ తెలుగువాడి ఉనికి యావద్భారతదేశం లోనూ కనిపిస్తుంది కానీ తెలుగువాడి శక్తి సత్తా మరింత చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదనీ తెలిపారు. 2000 సం లో తీసుకున్న నిర్ణయం తో సమైక్యభారతి ని ఏర్పాటు చేసి మాతృభాష పునరుద్ధరణ, కుటుంబవ్యవస్థ పరిరక్షణ లక్ష్యంగా నిర్విరామమైన కృషి చేస్తున్నామని వివరించారు. అంతేకాక మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి సంయుక్తంగా మాతృభాష ను పరిరక్షించడం లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగాధిపతి డా. యల్. మృదుల మరియు సంస్కృత శాఖాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు. విద్యార్థులు పద్యాల అంత్యాక్షరి తో నృత్యప్రదర్శనలతో మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు.
ఇదే వేదికపై నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల ఆటలపోటీలలో విజేతలకు అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ట్రోఫీలను, పతకాలను మరియు ధృవపత్రాలను అందించారు. తెలుగు ఉపన్యాసకులు జి. వీరాంజనేయులు గారు సభానిర్వహణ చేయగా జె. జయకృష్ణ గారు వందన సమర్పణ చేశారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.