ఫిబ్రవరి 21 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభలో మాతృభాష విజ్ఞానమయకోశానికీ, ఆనందమయకోశానికీ ఉత్ప్రేరకమని డా.కె.సత్యమూర్తిగారు మాతృభాష ఆవశ్యకతను, ఔన్నత్యాన్ని విశదీకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకమిత్రులు విద్యార్థులు పాల్గొన్నారు. అధ్యక్షులు తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగులోని మాధుర్యాన్ని హృద్యమైన పద్యాలలో దాగి ఉండే అంతరార్థాన్ని తెలియజెప్పారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు, పూర్వ విద్యార్థి శ్రీ పి. మధుసూదన్ గారు మాట్లాడుతూ ప్రాచ్య కళాశాలను స్థాపించడంలో అమ్మ యొక్క దూరదృష్టి, దివ్యదృష్టి అగణితమైనదని, అమ్మ ఆశయాలు భాషాభిమానుల ద్వారా నేడు నెరవేరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖాధ్యక్షురాలు డా.యల్. మృదుల నిర్వహించగా కె. వెంకటేష్ వందన సమర్పణ ఈ చేశారు. కార్యక్రమంలో పి.డి.సి ప్రథమ సంవత్సరం చదువుతున్న యమ్. మనస్విని, సంస్కృత విద్యార్థి మలయప్ప, బి.ఏ. ఫైనల్ ఇయర్ విద్యార్థిని పూర్ణిమ, పైనల్ ఇయర్ విద్యార్థి మురళి తెలుగు భాష ఔన్నత్యాన్ని తమ మాటలలో వివరించారు. శోభనా సులభాగతి పోతన ఉత్పలమాలికను శ్రావ్యంగా ఆలపించింది. అదేవిధంగా బి.ఏ. సెకండ్ ఇయర్ విద్యార్థి అంజనేయులు నృసింహావతార ఘట్టాన్ని హావభావాలతో ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది