జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ నెలకొల్పిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విజయవంతంగా అర్థ శతాబ్ది కాలంగా విద్యాసేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థులు వాడవాడలా స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆగష్టు 6, 7, 8, 9 తేదీల్లో ఈ మహోత్సవాలు అమ్మ ఆశయానికి అనుగుణంగా, నిరాడంబరంగా సార్థకంగా జరిగాయి. “జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి” పేరుతో తమతమ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేసుకున్న పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవాలను సుసంపన్నం చేశారు. సభలు నిర్వహించి అమ్మ ప్రేమతత్వాన్ని, సేవా దృక్పథాన్ని పదిమందికీ చాటి చెప్పారు. తమ తమ ప్రాంతాలలో వివిధ రంగాలలో ప్రముఖులైన పెద్దలను అతిథులుగా ఆహ్వానించి, అమ్మ తత్త్వ ప్రచారాన్ని దీక్షతో నిర్వహించారు. తమకు విద్యాభిక్షపెట్టిన గురువుల సందేశాలను సభలలో వినిపించారు. జిల్లెళ్ళమూడిలో వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను స్మరించి వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని ప్రకటించారు. అమ్మ ప్రబోధించిన ప్రేమ, సేవ, పరోపకార పారీణత నిరాడంబరత మొదలైన ఉదాత్త గుణాలను పునశ్చరణ చేసుకున్నారు. ఈ ఉత్సవ నిర్వహణలోని ఆంతర్యాన్ని వెల్లడించారు. మాతృశ్రీ విద్యాపరిషత్, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలల వ్యవస్థాపకులు, నిర్వాహకులు అయిన పెద్దలను స్మరించి, వారికి ఘనంగా నివాళులర్పించారు.
కీ.శే. అధరాపురపు శేషగిరిరావు, కీ. శే. బొడ్డుపల్లి సీతారామస్వామిశాస్త్రి, కీ.శే. కొండముది రామకృష్ణ, కీ.శే.పన్నాల రాధాకృష్ణశర్మ ప్రభృతుల త్యాగనిరతినీ, అకుంఠిత దీక్షనూ ఆదర్శంగా తీసుకుని ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అమ్మను, అమ్మ సంస్థనూ ఆదరించి తీర్చిదిద్దిన పెద్దలను మరువలేమని, అవకాశం ఉన్నంతలో అన్న సంతర్పణలు, ఉపకార వేతనాలు అందించి, అమ్మ ఆశయాన్ని ఆచరణ రూపంలో లోకానికి వెల్లడించటమే ఈ ఉత్సవాన్ని తమ ప్రాంతంలో నిర్వహించటంలోని ఆంతర్యమని స్పష్టం చేశారు. విద్యతో పాటు క్రమశిక్షణను సముదాత్త జీవన వైఖరినీ నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు చెప్పారు. సేవానిరతిని బోధించి, తమకు మార్గదర్శనం చేస్తున్న విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు.కాకినాడ: పూర్వవిద్యార్థి పి.అప్పారెడ్డి నేతృత్వంలో – మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవ సభ, అన్నప్రసాద వితరణ వైభవంగా జరిగాయి. ఎందరో పేదవిద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున ఉపకార వేతనాలు ఇచ్చారు.తెనాలి, రేపల్లె : పట్టణ ప్రముఖలతో సభలు నిర్వహించి, పూర్వవిద్యార్థులు అన్నప్రసాదం పంచి పెట్టారు.
పార్వతీపురం : 6వ తేది ఉ.10గంటలకు రాజా హిందీ శిక్షణ కళాశాలలో స్వర్ణోత్సవ సంరంభానికి శుభారంభం జరిగింది. శ్రీ గంటేడ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో విద్యావేత్త శ్రీ మంచిపల్లి శ్రీరాములు ప్రారంభోపన్యాసం చేశారు. పార్వతీపురం డి.యస్.పి. శ్రీ ఎ.సుభాష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. శ్రీ గంటేడ చిన్నంనాయుడు నేతృత్వంలో ఎందరో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలు, పురప్రముఖులు అమ్మ ప్రేమతత్త్వాన్ని కీర్తిస్తూ అంజలి ఘటించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఫుడ్బ్యాంకు పేరుతో పూర్వవిద్యార్థులు ఏర్పాటు చేసిన “అమ్మ అన్న ప్రసాద వితరణ” కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంటు శ్రీమతి వాగ్దేవి ప్రారంభించారు. పేదలకు, వ్యాధిగ్రస్తులకు, వికలాంగులకు అన్నప్రసాదం పంచారు. ముఖ్యవిశేషం ఏమిటంటే, 6వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటికీ నిరాటంకంగా సాగుతోంది.పాలకొండ : జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో – మాతృశ్రీ పూర్వవిద్యార్థులు అమ్మ కళాశాల స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జామి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని, సందేశం అందించారు. పూర్వవిద్యార్థులు మజ్జి సత్యం అధ్యక్షతలో జరిగిన ఈ సభను బౌరోతు శంకరరావు వ్యాఖ్యాతగా నిర్వహించారు. వ్యవహరించాడు. ఈ సందర్భంగా అమ్మ ఫోటోలను, బౌరోతు శంకర్రావు వ్రాసిన “జిల్లెళ్ళమూడి అమ్మ జీవిత చరిత్ర” గ్రంథాలను అందరికీ పంచిపెట్టారు. ఎందరో పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున ఉపకారవేతనం అందించారు. అనంతరం అందరికీ “మహాప్రసాదం” (భోజనం) ఏర్పాటు చేశారు.రాజాం : రాజాం పట్టణంలో పూర్వవిద్యార్థి పి.చైతన్యకుమార్ ఆధ్వర్యంలో ఫుడ్బ్యాంక్ ప్రారంభించి, అమ్మ ప్రసాదమైన అన్నం ఎందరికో పంచిపెట్టే కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, కరోనా రోగులకు సేవలు నిర్వహించారు.రాజమహేంద్రవరం : అమ్మ కళాశాల స్వర్ణోత్సవం రాజమహేంద్రవరం శ్రీ గాయత్రీ దత్తాత్రేయ వేదపాఠశాలలో జరిగింది. మాతృశ్రీ పూర్వవిద్యార్థి మరువాడ కామేశ్వరశర్మ నేతృత్వంలో వేద విద్యార్థులకు భోజన వసతి కోసం రూ.7,000/ నగదు, బియ్యం, కందిపప్పు, పంచదార మొదలైన నిత్యావసర సరుకులు సమర్పించారు.విజయనగరం : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవసభలో విజయనగరం జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి కె. సుధామణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖాధికారి శ్రీ రాజారావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అతిథులందరూ అమ్మ మహనీయతను, విద్యార్థుల కార్యదీక్షను ప్రశంసించారు. గతంలో తాము జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకొని, ఆశీస్సులు పొందామని ప్రకటించారు. సభానంతరం ఎందరో వికలాంగ యాచకులకు అమ్మప్రసాదంగా భోజనం పెట్టి, దుప్పట్లు పంచి పెట్టారు. పూర్వవిద్యార్థి త్రినాధ్ పర్యవేక్షణలో అక్కడి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి.విశాఖపట్నం : చంద్రంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మాతృశ్రీ పూర్వవిద్యార్థులు అమ్మ కళాశాల “స్వర్ణోత్సవం” విశాఖలో ఘనంగా విశాఖ డి.యస్.పి.శ్రీ బి. విజయకుమార్, అరబిందో ఫార్మాలిమిటెడ్ డి.జి.ఎం. శ్రీ ఎన్. వెంకట రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం. రాజబాబు, శ్రీమతి ఎ.జయప్రద, పేరెంట్స్కమిటీ ప్రతినిధులు శ్రీశ్రీనివాస్, శ్రీ సూరిబాబు ప్రభృతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూర్వవిద్యార్థి పొట్నూరు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అందరూ అమ్మ ఆశయాల ఔన్నత్యాన్ని, కళాశాల క్రమశిక్షణ వాతావరణాన్ని కొనియాడారు. అన్నం పెట్టటం, వస్త్రాలు ఇవ్వటం, వైద్యసహాయం మొదలైన సేవలన్నీ మాతృయాగంలో భాగమని అన్నారు. ఎందరో పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యిరూపాయలు చొప్పున ఉపకార వేతనం, ప్రశంసాపత్రం, అమ్మ కేలండర్, శివ లెంక ప్రసాదరావు రచించిన గ్రంథాలు అందించారు.శ్రీకాకుళంలో సాలూరులో “అమ్మ బడి” పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల జరుగుతున్నాయి. సాలూరులో రక్తదాన శిబిరాలు నిరంతరం నిర్వహిస్తున్న శివలెంక ప్రసాదరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పేదవిద్యార్థులకు – వెయ్యేసి రూపాయల చొప్పున విస్తృత స్థాయిలో ఉపకారవేతనాలు పంపిణీ జరిగింది.
వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో గంటేడ సోమేశ్వరరావు, తామాడ సూర్యనారాయణ, ఎం.జగన్నాధం, కొక్కిలిగడ్డ సూర్యనారాయణ, అరటికట్ల కామేశ్వరరావు, ఎ. హరిబాబు, హరనాధ్, భవిరిపూడి శ్రీరామమూర్తి, తులసీరావు, ఎ.వి.వి. రాజారావు, తెంటు కృష్ణమూర్తి, దత్తి కృష్ణ, పూడి కృష్ణ, దత్తి సూర్యనారాయణ, గౌరీప్రసాద్, దాసరి శ్రీరామమూర్తి, ఎ.యస్.వరప్రసాద్, జె. శేషాద్రి, రాఘవేంద్రరావు మొదలైన ఎందరో పూర్వ విద్యార్థులు సమధికోత్సాహంతో పాల్గొన్నారు.కుంభమేళా సందర్భంగా ఉత్తరభారతంలో విస్తృతంగా “అమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలుజరిగాయి. పూర్వ విద్యార్థుల ప్రతినిధిగా డాక్టర్ జయంతి చక్రవర్తి ఈ బాధ్యతను స్వీకరించి, నిర్వహించాడు. కళాశాల స్వర్ణోత్సవ సంరంభం అమ్మ అన్నప్రసాద వితరణం ఆనాడే ప్రారంభం అయ్యాయి.ఈ పూర్వ విద్యార్థులందరూ అమ్మ కరుణకు పాత్రులైన అదృష్టవంతులు. భావితరాలకు ఆదర్శ మూర్తులు. ఈ స్వర్ణోత్సవాలను నిర్వహించి, సేవ, ప్రేమ, త్యాగము, కరుణ మొదలైన అమ్మ ఆశయాలను ఆచరణాత్మకంగా అనుసరించిన అమ్మ తత్త్వ ప్రచార సాధకులు ఈ పూర్వవిద్యార్థులు. బాధ్యతా యుత మూర్తులైన ఈ ఆదర్శవిద్యార్థులను శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాయి. అమ్మ ఆశీస్సులలో వీరందరూ సకలాభీష్టాలు పొందాలని, ఇలాగే మరెన్నో సేవాకార్యక్రమాల ద్వారా అమ్మ తత్త్వాన్ని ప్రచారం చేయాలని ఆకాంక్షిస్తూ…
అభినందనలతో ఆశీస్సులతో శుభాకాంక్షలతో… సంపాదకవర్గం, “విశ్వజనని”