1971 లో అమ్మ నెలకొల్పిన ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 10, 11, 12 డిసెంబర్ 2021 తేదీలలో వైభవంగా జరిగాయి. 10-12-2021 ఉదయం శ్రీమతి వసుంధర జ్యోతి ప్రజ్వలన చేశారు. డా. యం. శ్యామల స్వర్ణోత్సవ గీతం గానం చేసింది. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతిగారు ఉత్సవాలను ప్రారంభించి స్వర్ణోత్సవ విశిష్ట సంచిక ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ దినకర్ వచ్చారు. శ్రీ విశ్వజననీ పరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు “విశ్వజనని” మాసపత్రిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రసిద్ధ ఉపన్యాసకులు ఆచార్య శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి స్వర్ణోత్సవ సంయోజన చేశారు.
ఉపసభాపతి శ్రీ రఘుపతి బాల్యం నుండి అమ్మతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించి సంస్కృతాంధ్ర భాషల అభివృద్ధి జాతికి మేలు చేస్తుందని చెప్పారు. సంస్కృతికళాశాల అభివృద్ధికి కృషిచేసిన శ్రీ బొప్పూడి రామబ్రహ్మగారికి “జీవిత సాఫల్యా సేవా పురస్కారం” అందించి సత్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తి నవభారత బాంక్ చైర్మన్ శ్రీ పాండురంగారావు శ్రీరామబ్రహ్మంగారిని గూర్చి ప్రసంగించారు. శ్రీదేశిరాజు కామరాజు గారు సభకు ఆహ్వానం పలికారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సభా నిర్వహణ చేశారు.
మధ్యాహ్నం జరిగిన సభలో శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధిగా అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ శ్రీ భూపతిరాజు సత్యనారాయణ రాజు సంస్కృతం ఈ జాతి జీవనాడి అంటూ చిన్నప్పటి తన అనుభవాలు అమ్మను చూడాలని జిల్లెళ్ళమూడిని దర్శించాలనే తన కోరిక ఈ రకంగా నెరవేరటం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ లక్కరాజు సత్యనారాయణ అమ్మతో తన అనుబంధాన్ని వివరించారు. పూర్వవిద్యార్థి సమితి విశ్వజననీ పరిషత్ కార్యవర్గసభ్యులను సత్కరించారు. పూర్వవిద్యార్థి శ్రీ యస్.యల్.వి.ఉమామహేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సాయంత్రం సామూహిక లలితాసహస్ర నామ పారాయణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడినవి.