73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఆగష్టు 15 వ తేదీన ఘనంగా జరిగాయి. అమ్మ చిత్రపటానికి మరియు భరతమాత చిత్ర పటానికి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య పుష్పమాల అలంకరణ నిర్వహించగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్.బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభలో ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామ వంశీ మాట్లాడుతూ పెద్దలు సంపాదించి పెట్టిన స్వాతంత్య్రాన్ని అనుభవిస్తూ మన సంస్కృతిని భావితరాలవారికి కూడా అందివ్వాలని తెలిపారు. కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబుగారు మాట్లాడుతూ బాధ్యతలను గుర్తించి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో శ్రమించాలని తెలిపారు. శ్రీ బొప్పూడి రామబ్రహ్మం మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో కలిసి కట్టుగా కృషి చేయాలని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.ప్రేమక్కుమార్, శ్రీ ప్రసాదవర్మ కామఋషి తదితరులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం ఆసాంతం విద్యార్థినులే నిర్వహించడం విశేషము. ఇదే వేదికపై పలువురు దాతలు అందించిన ప్రోత్సాహక నగదు బహుమతులను సంస్థ పెద్దలు విద్యార్థినీ విద్యార్థులకు అందించారు. దాతలకు కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.