సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్’, ‘రామాయణరసభారతి’, ‘ప్రసన్నవ్యాస’గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది.
ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యం. దినకర్, కాలేజి కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణ శ్రీమన్నారాయణమూర్తి విశిష్టతను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ శిష్ట్లా ప్రసాద్ సభాహ్వానం పలుకగా శ్రీ సత్యనారాయణమూర్తి వందన సమర్పణ చేశారు.
శ్రీశ్రీమన్నారాయణమూర్తిగారు వ్యాసుని విశిష్టతను, గురువు యొక్క అవసరాన్ని, వ్యాసుడు పలికిన సూత్రాలలోని గొప్పతనాన్ని అమ్మ ఏలా అనుభవంలో అందరికీ అందించిందీ చెప్పిన మహాద్భుత సమన్వయసారం అందరినీ ముగ్ధులను చేసింది. అమ్మ ఏకాదశినాడు అవతరించిందని, వ్యాసుడు ఆదిముని లోకరక్షణ చేయటానికి పూర్ణిమనాడు ఉద్భవించాడనీ, ఇద్దరూ లోకానికి అందించిన సూత్రాలూ, సంస్కారాలు జగజ్జాగృతికి ఉపయోగపడుతున్నాయని వ్యాసహృదయాన్ని, అమ్మ అనుభవ వేదాంత నిధులను రంగరించి అందించారు సంస్థ సముచితరీతిని సత్కరించింది.
తదనంతరం వాత్సల్యాలయ ప్రాంగణంలో సామూహికంగా డాక్టర్ బి.యల్.సుగుణగారి నేతృత్వంలో ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణ చేశారు. సాయంకాలం సోదరి ఎమ్.వి. సుబ్బలక్ష్మి గారి కృషితో జ్యోతిస్వరూపిణి, జ్ఞానరూపిణి అమ్మ శ్రీ చరణాల చెంత అసంఖ్యాకంగా దీపాలను వెలిగించి భక్తితో అమ్మ నామ సంకీర్తన చేసి మంగళహారతి నిచ్చారు.