సమాజాన్ని సంస్కారవంతముగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానందగిరిస్వామి తెలిపారు. 5-9-2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుపూజా మహోత్సవంలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువనీ, తాను ఆచరిస్తూ ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురుప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమములో సంస్థపెద్దలు సిబ్బంది పాల్గొన్నారు.