జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూన్ 23 శనివారం ‘జీవన నైపుణ్యాలు – వ్యక్తిత్వ వికాసం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారు అధ్యక్షత వహించగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాదిరాజు పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యక్తిత్వ వికాసంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. మనో విజ్ఞానశాస్త్రవేత్తగా, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆమె తమ అనుభవాలు వివరించారు. సరైన ఆరోగ్యం, ఆలోచనలు, అధ్యయనం సత్ప్రవర్తన వల్ల ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాయని డాక్టర్ జి. పద్మజ సోదాహరణంగా వివరించారు. మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలిపారు. వాగ్భూషణం భూషణం అంటూ మాటతీరు, ఆచరణ విధానం సవ్యంగా ఉండాలని సోదాహరణంగా వివరించారు. మానవ సంబంధాలు ఆదర్శవంతంగా, ఆరోగ్యకరంగా, ఆలోచనాత్మకంగా ప్రగతిదాయకంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఆమె సంధించిన ప్రశ్నావళి విద్యార్థులను ఉత్తేజపరిచాయి. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ యం. శరచ్చంద్ర మాట్లాడుతూ సంగీతం సకల మానవాళికి మానసిక ఆనందం కలిగిస్తుందని వివరించారు.