“నీ సేవలోనే నా జీవితం సాగనీ నీధ్యాసలోనే నాశ్వాస ఆగనీ ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ గారి 21 వ సంస్మరణ సభ 31-8-2019 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరంలో రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షత వహించారు. సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారుడు కొండముది సుబ్బారావు, సంస్థ రెసిడెన్సియల్ సెక్రటరి రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య ఒక అడ్మినిస్ట్రేటర్ గా తన బాధ్యతలను సజావుగా నెరవేర్చారని కళాశాల ప్రిన్సిపాల్ కొనియాడారు. ఆర్. ప్రసాద్ అన్నయ్య మాట్లాడుతూ అమ్మ ఆంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా నిర్విరామంగా కృషి చేశారని వివరించారు. చక్కా శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ అన్నయ్యతో గల అనుబంధాన్ని, ఆదరణను, అన్నయ్యలోని కార్యదీక్ష, అంకిత భావాన్ని గుర్తు చేసుకున్నారు. కొండముది సుభారావు గారు మాట్లాడుతూ రచయితగా అనేక ప్రక్రియలను, అమ్మ సాహిత్యాన్ని ముందు తరాలవారికి అందించారని తెలియజెప్పారు. లెక్చరర్ గా పనిచేస్తున్న మృదులగారిని సభాముఖంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండముది ప్రేమ కుమార్ మాట్లాడుతూ అన్నయ్య నిర్వహించిన సేవా కార్యక్రమలలో తాము కూడా పాల్గొని సంస్థ అభివృద్ధికై తమ వంతు కృషిచేస్తామని తెలియజెప్పారు. కొండముది రవి అన్నయ్య రాసిన పాటలను గానం చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్. ప్రవీణ్, దుర్గా ప్రసాద్ లకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు మరియు కొండముది స్మారక పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణ గారు ఫైనల్ ఇయర్ చదువుతున్న వి.శ్రావణి, కృష్ణ లకు బహుమతులను అందజేసారు. అంతేకాక సంబూరి చిరంజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్.నవ్య, భరత్ సాయిలకు బహుమతులను అందజేసారు. డా.యల్.మృదులగారు సభను నిర్వహించారు. అనంతరం సభలోని వారంతా కొండముది రామకృష్ణగారికి నివాళులర్పించారు.