అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ ప్రగతిపధంలో నడిపించారని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆగష్టు 31 శుక్రవారం జిల్లెళ్ళమూడిలో జరిగిన డాక్టర్ బి.యల్.సుగుణగారి ఉద్యోగ విరమణ సమావేశంలో అధ్యక్షులుగా ప్రవచన సమ్రాట్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ముఖ్య అతిధులుగా, సంస్థ చీఫ్ ప్యాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావుగారు ఆత్మీయ అతిధిగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు గౌరవ అతిధులు, యాక్టింగ్ ప్రెసిడెంట్ శ్రీ యన్.లక్ష్మణరావుగారు, స్థానిక కార్యదర్శి శ్రీ బి. రామచంద్ర, కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె.వి.కోటయ్య తదితరులు ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా విద్యాబోధనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించిన డాక్టర్ బి.యల్.సుగుణగారిని అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పుష్పార్చనతో జేజేలు పలుకుతూ ఆమెను వేదిక వద్దకు ఆహ్వానించారు. తనకు జరిగిన సన్మానానికి డా.బి.యల్. సుగుణ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, వారి ఉన్నతి కోసం విద్యాబోధనతో పాటు వివిధ ఉద్యోగపోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం, వారిని సన్మార్గంలో నడిపించడం, తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. విద్యార్థులలో సేవాగుణం, పరోపకారబుద్ధి, త్యాగ భావన వర్థిల్లేలా తమ వంతు సేవలను అందించినట్లు వివరించారు. తన ఉద్యోగ విరమణ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రగతి కోసం 3,00,000ల రూపాయిలను ఆమె కళాశాలకు అందించారు.