జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు  కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు  ఋషులు మనకు అందించిన శాస్త్రాలలో యోగ శాస్త్రం ఒకటని తెలిపారు. మానవునిలోని షడ్చక్రాలను చైతన్య పరచడమే దీని లక్ష్యమని అష్టాంగ యోగంలో ప్రధానమైన ఆసన, ప్రాణాయామాల ద్వారా మనో నిగ్రహాన్ని కలిగించుకోగలమని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి ఓంకారానంద గిరిస్వామి గారు రచించిన *సుగతి యోగం* అనే పుస్తకాన్ని ప్రిన్సిపాల్ గారు ఆవిష్కరించారు. 

 గారు సుగతి యోగంలోని విషయాలను తెలియపరుస్తూ రచయిత జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్రను సంగ్రహించి వ్రాయ తలపెట్టిన తనకు అమ్మ జీవితమే ఒక దివ్య యోగంలా అనిపించి ఆమెను యోగమూర్తిగా దర్శించి దివ్యమైన అనంతమైన జీవిత పరమావధిని తెలుపుతూ ఈ పుస్తకాన్ని రచించినట్లుగా చెప్పారు. *ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే* అని చెప్పిన యోగశిఖోపనిషత్తుకు దగ్గరగా అమ్మ ‘ద్వంద్వాల మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉంద’ని తెలిపిందన్నారు. 

జాండ్రపేట నుంచి ప్రముఖ యోగాచార్యులు శ్రీ పద్మనాభుని తులసీరావు మాధవి దంపతులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారు విశిష్ట అతిథిని సభకు పరిచయం చేశారు. తులసీ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అందరిలో ఉండే ఉత్సాహమే ఉత్సవంగా మారుతుంది కనుక అందరూ చిన్నచిన్న యోగాసనాల ద్వారా ఆరోగ్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉండవచ్చునని తెలిపారు.  యోగ అంటే కలయిక ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ రెండింటిని సమతుల్యం చేసుకోగలిగితే మనలో ఉన్న అనంతమైన శక్తి బయటకు వస్తుందని వివరించారు. పార్టిసిపేటివ్ మెథడ్ అనుసరిస్తూ విద్యార్థులతో మాట్లాడిస్తూ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ద్వారా వచ్చే శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేలా చేశారు. మన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండగలదని  తెలిపారు. కార్యక్రమంలో సత్యమూర్తి గారికి తులసిరావు, మాధవి దంపతులకు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమం ఆసాంతం తెలుగు ఉపన్యాసకులు శ్రీ బి.వి. శక్తిధర్ గారు సభా నిర్వహణ చేయగా డాక్టర్ యల్. మృదుల గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.