అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని సోదాహరణంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగాచార్యులు డా॥ కె. సత్యమూర్తి మాట్లాడుతూ అష్టాంగ యోగా విధానాలు ఆరోగ్యప్రదాయకమని తెలిపారు. శరీరాన్ని మనసుతో సమన్వయం చేసే ప్రక్రియ యోగా అని వివరించారు. ద్యాసే ధ్యానం అని, మౌనం అంటే సంకల్ప వికల్ప రహిత స్థితిలో ఉండడమని అమ్మ సూత్రీకరించినట్లు వివరించారు. ద్వంద్వమును ద్వంద్వముతో జయించటం యోగమని ద్వంద్వము నుండి ఏకత్వము సాధించటానికి యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ వేదికపై యోగా శిక్షకురాలు ఎమ్. వాహిని మాట్లాడుతూ ఆసనాలు ధ్యానం ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా తెలిపారు. వేదికపై విద్యార్ధినీ విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి అందరిని అలరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల సంస్కృత అధ్యాపకులు డా॥ ఎ. హనుమత్ ప్రసాద్ గారు స్వాగతం పలికి వివిధ అంశాలను వ్యాఖ్యానించి వందన సమర్పణ నిర్వహించారు. యోగసాధనను నిరంతర ప్రక్రియగా పాటించి ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతులుగా వర్థిల్లాలని కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు శ్వేత హితవు పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.