గురు పూర్ణిమ

వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని 2024, జూలై 20 వ తేదీ శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రత్యేక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణ చేస్తూ గురువు యొక్క ప్రాముఖ్యతను తెలిపే పురాణ గథలలోని కథలను ఉట్టంకించి సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని విద్యార్థులకు సవివరంగా తెలియజెప్పారు. అనంతరం గుంటూరు TJPS కళాశాల నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. పి. దేవేందర్ గుప్తా గారు ఆషాడ పూర్ణిమ రోజన వేదవ్యాసుల వారి జన్మదినాన్ని గురుపూర్ణిమ గా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అనీ, పంచమవేదం గా కీర్తింపబడిన మహాభారతంలో గురువు ప్రాముఖ్యత ను స్థానాన్ని కర్తవ్యాన్ని సయుక్తికంగా ఉపదేశించారని వివరించారు. మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యాసుల వారి ఆశీర్వాదం మనందరికీ లభించాలని తెలిపారు. సర్వభూతముల యందు దయ కలిగి యుండుట, సత్యమార్గంలో నడుచుట, శాంతగుణాన్ని కలిగి యుండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలని వ్యాసులవారు అందించిన సందేశాన్ని ప్రతి గురువు శిష్యునకు ఉపదేశించాలని వివరించారు. అంతేకాక గురువును పూజించే సంస్కారం తరువాతి తరాల వారికి అందించడం మనధర్మం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని కె. నిత్యసంతోషిణి (తెలుగు లో), కె పూజిత(సంస్కృతం లో) గురువు ప్రాశస్త్యాన్ని తమ మాటలలో చక్కగా వివరించారు. సంస్కృత విభాగం తరుపున జరిగిన ఈ సభను అధ్యక్షులు డా. ఆర్. వి.యన్.యస్.యస్ వరప్రసాద్ గారు సంచాలకులుగా వ్యవహరించగా సంస్కృత ఉపన్యాసకులు డా. వి. త్రయంబకం ధన్యవాద సమర్పణ గావించారు. కళాశాల మరియు యాజమాన్యం పక్షాన ముఖ్య అతిథికి అమ్మ ప్రసాదాన్ని అందించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం జరిగింది.