అమృతభాష పునరుద్ధరణకై ప్రపంచవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ పర్వదినం రోజున విశ్వ సంస్కృతభాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల లో జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల అని చాటి చెప్పే విధంగా సంస్కృతభాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ అధ్యక్షభాషణ చేస్తూ పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా అనే నినాదంతో విద్యార్థులను సంస్కృతం లో మాట్లాడే ప్రయత్నం నేటినుంచే ప్రారంభించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సంస్కృతభాష ప్రాచారానికై అహర్నిశం కృషి చేస్తున్న సంస్కృతభారతి సంస్థ తరుపున చీరాల జనపదం లో బాలకేంద్రాలను నిర్వహిస్తున్న శ్రీమతి సి.హెచ్. గీత గారు ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు సంస్కృతభాషా ప్రచార సాధకులుగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఉండాలని అలా మీరు ప్రయత్నం చేయాలని చెప్పారు. అంతేకాక విద్యార్థులకు బాలకేంద్రాన్ని స్వయంగా నిర్వహించి సులభ శైలిలో సంస్కృతంలో మాట్లాడడం నేర్పించారు. కళాశాల విద్యార్థులు సంస్కృతగీతాలాపన, శ్లోకపఠనం ఛేశారు. సంస్కృతభాషా ప్రాశస్త్యాన్ని చాటి చెప్తూ నృత్యప్రదర్శన గావించారు. సంస్కృతవిభాగం తరుపున జరిగిన ఈ కార్యక్రమంలో సంస్కృతశాఖాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు సభానిర్వహణ చేయగా, డా. వి. త్రయంబకం గారు వందనసమర్పణ చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిమంత్రంలో కార్యక్రమం ముగిసింది.