సంస్కృతభాష మాతృభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం పరిచయం ఉంటుందని, సంభాషణ ద్వారానే భాష అభివృద్ధి చెందుతుందని సంస్కృతభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్ష, భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్ధి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరు నుండి ’’సంభాషణ సందేశం‘‘ అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దనహెగ్దే గారు విచ్చేశారు. వారు మాట్లాడుతూ సంస్కృతంలో కేవలం వేద వేదాంగ ఇతిహాస పురాణ కావ్యాలే కాక విజ్ఞానశాస్త్రం కూడా ఉందనీ ఇది సర్వ విదితమని ఉపదేశించారు. అంతేకాక సంస్కృతం భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేస్తుందని కొనియాడారు. భాష యొక్క సౌందర్యం సంభాషణ ద్వారా తెలుస్తుందని సంస్కృత సంభాషణకు సంస్కృత మాసపత్రికలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ీ కార్యక్రమంలో సంస్కృత విభాగంలోని అధ్యాపకులు డా. ఎ. సుధామ వంశీ, డా. అన్నదానం హనుమత్ ప్రసాద్, డా. ఆర్. వరప్రసాద్, డా. వి. పావని. యమ్. వాహిని లు పాల్గొని విద్యార్ధులు సంస్కృతం మాట్లాడేలాగా ఉత్తేజపరిచారు.