అజ్ఞానాన్ని పోగొట్టుకొని సుజ్ఞానం పొందాలంటే నిరంతర అధ్యయనం సాగించాలని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛభారత్ ప్రత్యేకాధికారి శ్రీ పి.విద్యాసాగర్ వివరించారు. జులై, 9వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన ప్రసంగం ఆద్యంతం హృద్యంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అంచలంచెలుగా కొనసాగుతూ మానవుడు మహోన్నతుడు అవుతాడని వివరించారు. సుజ్ఞానం వలన మానవునికి బ్రహ్మానందస్థితి, ప్రజ్ఞ వలన ఆత్మానందం, విజ్ఞ వలన దివ్యానందం, ఆజ్ఞ వలన విషయానందం లభ్యమవుతాయని ఆయన విపులీకరించారు. విద్యవల్లనే మానవుడు ఈ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాడని విశదీకరించారు. ప్రశ్నోత్తరాలతో విద్యార్థులను ఆలోచింప జేస్తూ వారి నుండి సమాధానాలను రాబడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా తమ ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రసంగంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ సంభాషించడం వల్ల ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కళాశాల అభివృద్ధి కోసం విద్యాసాగర్ గారి శిష్యులు 50,000/- రూపాయలు విరాళం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.