వైభవంగా గురుపూర్ణిమ

విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించే సత్సంప్రదాయానికి వేదిక గురుపూర్ణిమ అని ప్రముఖ సాహితీవేత్త ప్రవచన కళానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వివరించారు. జులై 29 శుక్రవారం అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో జరిగిన గురుపౌర్ణమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువును పూజించడం ప్రతి ఒక్కరి ధర్మమని వివరించారు. అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదించే గురువును పూజించి ప్రతి ఒక్కరూ జన్మను సార్థకం చేసుకోవాలని మల్లాప్రగడ హితవు పలికారు. కార్యక్రమంలో భాగంగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణగారిని ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వజనని అమ్మ దివ్యచరిత్ర మహోదధిలో తరంగాలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు.గురుపౌర్ణమి సందర్భంగా అమ్మభక్తురాలు సుబ్బలక్ష్మిగారు పలువురు అమ్మ భక్తులు, అభిమానులు, విద్యార్థినీ విద్యార్థులు దీపోత్సవం నిర్వహించారు. అజ్ఞానాంధకారం అంతరించి విజ్ఞానకాంతులుగా ప్రకాశించాలని కోరుతూ అమ్మని ప్రార్థించారు.

విద్యార్థులకు సంగీత శిక్షణ ప్రదర్శన

అమ్మ ఆస్థాన విద్వాంసునిగా అమ్మ అనుగ్రహంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ రావూరి ప్రసాద్ ఒక అర్థమండలం రోజులపాటు దాదాపు 30 మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చక్కని పాటలు రాగయుక్తంగా పాడటానికి శిక్షణ యిచ్చి 28.7.2018 నాడు వాద్యకారుల సహకారంతో నేర్చుకున్న అందరు విద్యార్థుల చేత సామూహిక పాటల కచేరి, వ్యక్తిగత గాన కచేరి చేయించి విద్యార్థులు, ఆచార్యులు, అందరింటి సోదరులకు వీనుల విందు చేశారు. దాదపు రెండు గంటలపాటు అందరూ తమను తాము మరచి అమృతగాన పారవశ్యంలో మునిగిపోయారు.కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆచార్యులు, పాలకవర్గపెద్దలు శ్రీ రావూరి ప్రసాద్ను పొగడ్తలతో ముంచెత్తి సత్కరించారు. శ్రీరావూరి ప్రసాద్ శిక్షణా కార్యక్రమం అమ్మ ఆదేశంగా భావించి చేశానని అన్నివిధాల సహకరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణ, పరిషత్ కార్యదర్శి శ్రీరామచంద్రలకు కృతజ్ఞతలు పలికి సత్కరించారు.

గురుపూజా మహోత్సవము

సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్’, ‘రామాయణరసభారతి’, ‘ప్రసన్నవ్యాస’గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది.ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యం. దినకర్, కాలేజి కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణ శ్రీమన్నారాయణమూర్తి విశిష్టతను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ శిష్ట్లా ప్రసాద్ సభాహ్వానం పలుకగా శ్రీ సత్యనారాయణమూర్తి వందన సమర్పణ చేశారు.శ్రీశ్రీమన్నారాయణమూర్తిగారు వ్యాసుని విశిష్టతను, గురువు యొక్క అవసరాన్ని, వ్యాసుడు పలికిన సూత్రాలలోని గొప్పతనాన్ని అమ్మ ఏలా అనుభవంలో అందరికీ అందించిందీ చెప్పిన మహాద్భుత సమన్వయసారం అందరినీ ముగ్ధులను చేసింది. అమ్మ ఏకాదశినాడు అవతరించిందని, వ్యాసుడు ఆదిముని లోకరక్షణ చేయటానికి పూర్ణిమనాడు ఉద్భవించాడనీ, ఇద్దరూ లోకానికి అందించిన సూత్రాలూ, సంస్కారాలు జగజ్జాగృతికి ఉపయోగపడుతున్నాయని వ్యాసహృదయాన్ని, అమ్మ అనుభవ వేదాంత నిధులను రంగరించి అందించారు సంస్థ సముచితరీతిని సత్కరించింది.తదనంతరం వాత్సల్యాలయ ప్రాంగణంలో సామూహికంగా డాక్టర్ బి.యల్.సుగుణగారి నేతృత్వంలో ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణ చేశారు. సాయంకాలం సోదరి ఎమ్.వి. సుబ్బలక్ష్మి గారి కృషితో జ్యోతిస్వరూపిణి, జ్ఞానరూపిణి అమ్మ శ్రీ చరణాల చెంత అసంఖ్యాకంగా దీపాలను వెలిగించి భక్తితో అమ్మ నామ సంకీర్తన చేసి మంగళహారతి నిచ్చారు.