Telugu Bhasha Dinothsavam in Association with Andhra Viswakala Parishat & Samaikya Bharathi
తెలుగు భాషా దినోత్సవం
ఆగష్ట్ 29 , 2024 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి , ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో వాత్సల్యాలయ ప్రాంగణంలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముందుగా గౌరవ అతిథి గిడుగు రామమూర్తి గారి ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గిడుగు వారి భాష మరియు సాహిత్య సేవను, గ్రాంథిక వ్యవహార భాషల వ్యత్యాసమును పండితుల తిరస్కారమును , వ్యవహార భాషోద్యమ చరిత్రను వారి జీవిత ఇతివృత్తాన్ని తెలియపరిచారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా: అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు నేడు ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు భాషకు మనమందరం పూర్వవైభవం పొందే విధంగా కృషి చేయాలనే సందేశం అందించారు. తదనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు రెక్టార్ డాక్టర్ పి .వరప్రసాద మూర్తి గారు వ్యవహార భాషా ఉద్యమంలో భాగంగా గిడుగు వారితో పాటు గురజాడ వారి సేవలను వివరించి, మన కర్తవ్యాన్ని తెలియజేశారు. తర్వాత ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం, విశాఖపట్నం నుండి విచ్చేసిన డాక్టర్ :వెంకటేశ్వర యోగి గారు యథారాజా తథాప్రజా అనే ఆర్యోక్తిని యథారాజా తథాభాషా అని అన్వయం చేస్తూ , పరభాషని అభిమానిస్తూ మాతృభాషను మరిస్తే మన భాష మనుగడ కష్టం అని గుర్తించి మాతృభాషా సేవ చేయాలని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారులు సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త , మన విశిష్ట అతిథి శ్రీ పి. కన్నయ్య గారు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన జిల్లెళ్ళమూడిలో నేటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నేను కూడా అమ్మ బిడ్డను అయ్యానని, తెలుగు భాషకు మీరందరూ కూడా మరింత సత్కీర్తిని కలిగించాలని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. తదుపరి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రసాద వర్మ కామ ఋషి గారు ఆంధ్రభాష సేవను గూర్చి తెలియజేస్తూ , మన భాష అభివృద్ధికి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. అనంతరం ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు మానసిక ఉల్లాసాన్ని కలిగించే హాస్య రసాన్ని జోడించి తెలుగు భాష విశిష్టతను తెలియపరిచారు. అటు తర్వాత మరో ఆత్మీయ అతిథి శ్రీ వర్రే నాంచారయ్య గారు విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంజనేయులు నాయుడు గారు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించడం మన కర్తవ్యం అని, తెలుగు వెలుగులను పంచిన మహనీయులందరిని మనం గుర్తుంచుకోవాలని వారి అడుగుజాడల్లో నడవాలని అమూల్యమైన సందేశాన్ని అందించారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్: లక్కవరపు మృదుల సభా నిర్వహణ చేయగా, తెలుగు అధ్యాపకులు కె. హేమంత్ గారు వందన సమర్పణ చేశారు. కళాశాల విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను ఆనంద పరిచారు. ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో విజయవంతంగా ముగిసింది