by MOC IQAC | Sep 28, 2024 | Special Days
28-9-2024 న గుఱ్ఱం జాషువా జయంతి నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱంజాషువా జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా జయంతి సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించగా తెలుగు విభాగాధిపతి శ్రీమతి యల్ మృదుల సభా ప్రాతినిధ్యాన్ని వహించారు. తెలుగు అధ్యాపకులు శ్రీ టి. జయకృష్ణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వరీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన మహనీయుడు జాషువా అని ఆయన రచనలను, వైశిష్ట్యాన్ని, వారి కవితా మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగు విభాగ అధ్యక్షురాలు డా. యల్. మృదుల మాట్లాడుతూ అవమానాలు పొందిన చోటే సత్కారాలను పొందిన జాషువా జీవితవిశేషాలను తెలియజేశారు. అనంతరం తెలుగు అధ్యాపకులు శ్రీ జి. వీరాంజనేయులు జాషువా రచనలలోని దేశభక్తి పాటతో విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
by MOC IQAC | Aug 29, 2024 | Special Days
తెలుగు భాషా దినోత్సవం
ఆగష్ట్ 29 , 2024 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి , ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో వాత్సల్యాలయ ప్రాంగణంలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముందుగా గౌరవ అతిథి గిడుగు రామమూర్తి గారి ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గిడుగు వారి భాష మరియు సాహిత్య సేవను, గ్రాంథిక వ్యవహార భాషల వ్యత్యాసమును పండితుల తిరస్కారమును , వ్యవహార భాషోద్యమ చరిత్రను వారి జీవిత ఇతివృత్తాన్ని తెలియపరిచారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా: అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు నేడు ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు భాషకు మనమందరం పూర్వవైభవం పొందే విధంగా కృషి చేయాలనే సందేశం అందించారు. తదనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు రెక్టార్ డాక్టర్ పి .వరప్రసాద మూర్తి గారు వ్యవహార భాషా ఉద్యమంలో భాగంగా గిడుగు వారితో పాటు గురజాడ వారి సేవలను వివరించి, మన కర్తవ్యాన్ని తెలియజేశారు. తర్వాత ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం, విశాఖపట్నం నుండి విచ్చేసిన డాక్టర్ :వెంకటేశ్వర యోగి గారు యథారాజా తథాప్రజా అనే ఆర్యోక్తిని యథారాజా తథాభాషా అని అన్వయం చేస్తూ , పరభాషని అభిమానిస్తూ మాతృభాషను మరిస్తే మన భాష మనుగడ కష్టం అని గుర్తించి మాతృభాషా సేవ చేయాలని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారులు సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త , మన విశిష్ట అతిథి శ్రీ పి. కన్నయ్య గారు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన జిల్లెళ్ళమూడిలో నేటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నేను కూడా అమ్మ బిడ్డను అయ్యానని, తెలుగు భాషకు మీరందరూ కూడా మరింత సత్కీర్తిని కలిగించాలని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. తదుపరి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రసాద వర్మ కామ ఋషి గారు ఆంధ్రభాష సేవను గూర్చి తెలియజేస్తూ , మన భాష అభివృద్ధికి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. అనంతరం ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు మానసిక ఉల్లాసాన్ని కలిగించే హాస్య రసాన్ని జోడించి తెలుగు భాష విశిష్టతను తెలియపరిచారు. అటు తర్వాత మరో ఆత్మీయ అతిథి శ్రీ వర్రే నాంచారయ్య గారు విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంజనేయులు నాయుడు గారు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించడం మన కర్తవ్యం అని, తెలుగు వెలుగులను పంచిన మహనీయులందరిని మనం గుర్తుంచుకోవాలని వారి అడుగుజాడల్లో నడవాలని అమూల్యమైన సందేశాన్ని అందించారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్: లక్కవరపు మృదుల సభా నిర్వహణ చేయగా, తెలుగు అధ్యాపకులు కె. హేమంత్ గారు వందన సమర్పణ చేశారు. కళాశాల విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను ఆనంద పరిచారు. ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో విజయవంతంగా ముగిసింది
by MOC IQAC | Aug 19, 2024 | Special Days
అమృతభాష పునరుద్ధరణకై ప్రపంచవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ పర్వదినం రోజున విశ్వ సంస్కృతభాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల లో జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల అని చాటి చెప్పే విధంగా సంస్కృతభాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ అధ్యక్షభాషణ చేస్తూ పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా అనే నినాదంతో విద్యార్థులను సంస్కృతం లో మాట్లాడే ప్రయత్నం నేటినుంచే ప్రారంభించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సంస్కృతభాష ప్రాచారానికై అహర్నిశం కృషి చేస్తున్న సంస్కృతభారతి సంస్థ తరుపున చీరాల జనపదం లో బాలకేంద్రాలను నిర్వహిస్తున్న శ్రీమతి సి.హెచ్. గీత గారు ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు సంస్కృతభాషా ప్రచార సాధకులుగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఉండాలని అలా మీరు ప్రయత్నం చేయాలని చెప్పారు. అంతేకాక విద్యార్థులకు బాలకేంద్రాన్ని స్వయంగా నిర్వహించి సులభ శైలిలో సంస్కృతంలో మాట్లాడడం నేర్పించారు. కళాశాల విద్యార్థులు సంస్కృతగీతాలాపన, శ్లోకపఠనం ఛేశారు. సంస్కృతభాషా ప్రాశస్త్యాన్ని చాటి చెప్తూ నృత్యప్రదర్శన గావించారు. సంస్కృతవిభాగం తరుపున జరిగిన ఈ కార్యక్రమంలో సంస్కృతశాఖాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు సభానిర్వహణ చేయగా, డా. వి. త్రయంబకం గారు వందనసమర్పణ చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిమంత్రంలో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Aug 6, 2024 | Special Days
06 08 2024 మంగళవారం 54వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లెళ్ళమూడి వాత్సల్యాలయ ప్రాంగణంలో జరిగాయి. కళాశాల జాతీయస్థాయి గుర్తింపు పొందిన సందర్భంగా ఈ సభ మరింత విశిష్టతను సంతరించుకుంది. SVJP TRUST CHAIRMAN శ్రీ V S R మూర్తి గారు ఈ సభకు అధ్యక్షత వహించి అధ్యక్షభాషణ చేస్తూ అమ్మ భావ సంపదకు రూపకల్పనయే. కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం అనీ తద్ద్వారా ఈ కళాశాల మరో ముందడుగు వేసి విశ్వజనీనం కావాలని మంగళాశాసనం చేశారు. అనంతరం మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాలల పూర్వ విద్యార్థిసమితి వారు కళాశాల పూర్వకరెస్పాండెంట్ అయిన శ్రీ. M. S శరశ్చంద్ర గారిని విశేషంగా సత్కరించారు. College Management Committee Convener శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, పెద్దలు శ్రీ బొప్పూడి రామ బ్రహ్మంగారు ఈ సభలో పాల్గొన్నారు. SVJP TRUST MANAGING TRUSTEE శ్రీ పి. గిరిధర కుమార్ గారు అవిశ్రాంతంగా పనిచేసిన కళాశాల అధ్యాపక బృందాన్ని అభినందించి రజత పతకాలతో సత్కరించారు. పూర్వ విద్యార్థి సమితి తరఫున గోగినేని రాఘవేంద్రరావు గారు, రామకృష్ణ గారు అధ్యాపకులందరికీ వస్త్రాలను బహూకరించారు. PRINCIPAL డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ కళాశాల 2023 – 24 వార్షిక నివేదికను అందించారు. శరశ్చంద్ర గారి ఆధ్వర్యంలో BASICS IN CARNATIC MUSIC అనే సర్టిఫికెట్ కోర్సుపూర్తిచేసిన విద్యార్థులు గీతాలాపన చేశారు. వీరికి trust పెద్దలు ప్రమాణ పత్రాలను అందించారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జరిపిన సాహితీ పరమైన పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలను పొందిన వారికి పూర్వ విద్యార్థి సమితి పుస్తకాలను బహూకరించింది. కార్యక్రమంలో నందగోపాలం అంటూ విద్యార్థినిలు ప్రదర్శించిన కోలాటం అందరినీ అలరించింది. కళాశాల సంస్కృతశాఖాధ్యక్షులు R వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. తెలుగు శాఖాధిపతి డా. L. మృదుల వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by admin | Jul 20, 2024 | Guru Purnima, Special Days
గురు పూర్ణిమ
వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని 2024, జూలై 20 వ తేదీ శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రత్యేక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణ చేస్తూ గురువు యొక్క ప్రాముఖ్యతను తెలిపే పురాణ గథలలోని కథలను ఉట్టంకించి సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని విద్యార్థులకు సవివరంగా తెలియజెప్పారు. అనంతరం గుంటూరు TJPS కళాశాల నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. పి. దేవేందర్ గుప్తా గారు ఆషాడ పూర్ణిమ రోజన వేదవ్యాసుల వారి జన్మదినాన్ని గురుపూర్ణిమ గా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అనీ, పంచమవేదం గా కీర్తింపబడిన మహాభారతంలో గురువు ప్రాముఖ్యత ను స్థానాన్ని కర్తవ్యాన్ని సయుక్తికంగా ఉపదేశించారని వివరించారు. మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యాసుల వారి ఆశీర్వాదం మనందరికీ లభించాలని తెలిపారు. సర్వభూతముల యందు దయ కలిగి యుండుట, సత్యమార్గంలో నడుచుట, శాంతగుణాన్ని కలిగి యుండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలని వ్యాసులవారు అందించిన సందేశాన్ని ప్రతి గురువు శిష్యునకు ఉపదేశించాలని వివరించారు. అంతేకాక గురువును పూజించే సంస్కారం తరువాతి తరాల వారికి అందించడం మనధర్మం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని కె. నిత్యసంతోషిణి (తెలుగు లో), కె పూజిత(సంస్కృతం లో) గురువు ప్రాశస్త్యాన్ని తమ మాటలలో చక్కగా వివరించారు. సంస్కృత విభాగం తరుపున జరిగిన ఈ సభను అధ్యక్షులు డా. ఆర్. వి.యన్.యస్.యస్ వరప్రసాద్ గారు సంచాలకులుగా వ్యవహరించగా సంస్కృత ఉపన్యాసకులు డా. వి. త్రయంబకం ధన్యవాద సమర్పణ గావించారు. కళాశాల మరియు యాజమాన్యం పక్షాన ముఖ్య అతిథికి అమ్మ ప్రసాదాన్ని అందించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం జరిగింది.
by admin | Dec 15, 2019 | Special Days
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని కలలుకన్న ప్రాణత్యాగి పొట్టి శ్రీరాములు గారని తెలియజేశారు. లక్షమందిని ఏక పంక్తిన భోజనం చేస్తే చూడాలనుకున్న అమ్మ ఆశయం మహాద్భుతమైనదని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ గారు డా॥ బి.ఎల్.సుగుణ, అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్యగారు భక్తిప్రపత్తులతో శ్రీరాములుగారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు