by admin | Jan 1, 2018 | Book Exhibition
విజయవాడలో జనవరి 1 నుంచి 11 వరకు జరిగిన ’30వ విజయవాడ బుక్ ఫెస్టివల్’ లో శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున ఒక స్టాలును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగముగా కొత్తగా విడుదలైన మాతృశ్రీ జీవిత మహోదధితో పాటు అమ్మ సాహిత్యం అందరికి అందేలా ఏర్పాటు చేయడమైంది. బుక్ ఫెస్టివల్కి వచ్చిన పుస్తక ప్రియులకు, ఆధ్యాత్మిక సాహిత్య అభిలాషకులకు పలు గ్రంథాలను డిస్కౌంట్ ధరకు కూడా అందించడమైంది. ఈ పుస్తక ప్రదర్శనను మాతృశ్రీ పాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ వల్లూరి త్రయంబకం గారు, పీడీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హనుమత్ సాయి, గోవింద్ అనే విద్యార్థుల సహాయంతో సమర్థవంతంగా నిర్వహించారు. వీరందరికి వసతి, భోజన సదుపాయాలను ప్రెసిడెంట్ రామబ్రహ్మంగారు వారి స్వగృహమునందే ఏర్పాటు చేయడమే కాక, ఎంతగానో సహకరిస్తూ, ఈ కార్యక్రమ నిర్వహణలో వీరికి మార్గనిర్దేశనం చేశారు. కాగా ఈ బుక్ ఫెస్టివల్ సందర్భంగా ‘అమ్మ యొక్క తత్త్వ ప్రచారమునకు, అలానే ఫిబ్రవరి 17న జరిగే ‘ధాన్యాభిషేకం’ కార్యక్రమం గురించి, అమ్మను తెలిసిన వారికి, తెలియని వారికీ కూడా తెలియపరిచే ఒక చక్కని అవకాశం లభించినట్లుగా త్రయంబకంగారు తెలిపారు.
by admin | Sep 5, 2017 | Uncategorized
సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని శంకారానంద గిరి స్వామి తెలిపారు. 5/9/2017 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుమహాత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువన్నారు. తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శ గురువని తెలియ జెప్పారు. తెలుగు ఉపన్యాసకులు కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు. ఎస్. లక్ష్మణ రావు, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Jul 22, 2017 | Human Values, Skill Programmes, Soft Skills, Uncategorized
అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు . ” స్వధర్మే నిధనం శ్రేయః ” అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు వివరించారు. 22-7-2017 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో భగవద్గీత – లైఫ్ స్కిల్స్’ అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ భగవద్గీత లోని అనేక విషయాలు నిత్యజీవితంలో పాటించ గలిగితే జీవనం సుగమం అవుతుందని సోదాహరణంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ గారి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో 1986 సం॥ నాటి పూర్వ విద్యార్థులు పాల్గొనటం విశేషం. భగవద్గీత మహోన్నతునిగా తీర్చి దిద్దగలదని స్వీయానుభూతులైన ఎన్నో అంశాలను ఉదహరిస్తూ రామబ్రహ్మం అన్నయ్య ప్రసంగించారు. విద్యార్థులంతా అమ్మ తత్వాన్ని అలవరచుకోవాలని తెలియ చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.