అబల కాదు సబల

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో 10/07/2018వ తేదీన ఆడవాళ్లు అబలలు కాదు. సబలలు అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు రూరల్ పోలీస్ కానిస్టేబుల్ నాగజ్యోతి, వెన్నెల తదితరులు విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగాలని ఉద్భోదించారు. సమస్యలకు భయపడకూడదని మహిళలు అబలలు కాదు అని సబలలు అని అన్నారు. మహిళాపోలీసులు విద్యార్థినులను ఏమైనా సమస్యలు వున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అందరికీ అవగాహన కల్గించారు.

భుక్తి విద్య – ముక్తి విద్య

అజ్ఞానాన్ని పోగొట్టుకొని సుజ్ఞానం పొందాలంటే నిరంతర అధ్యయనం సాగించాలని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛభారత్ ప్రత్యేకాధికారి శ్రీ పి.విద్యాసాగర్ వివరించారు. జులై, 9వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన ప్రసంగం ఆద్యంతం హృద్యంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అంచలంచెలుగా కొనసాగుతూ మానవుడు మహోన్నతుడు అవుతాడని వివరించారు. సుజ్ఞానం వలన మానవునికి బ్రహ్మానందస్థితి, ప్రజ్ఞ వలన ఆత్మానందం, విజ్ఞ వలన దివ్యానందం, ఆజ్ఞ వలన విషయానందం లభ్యమవుతాయని ఆయన విపులీకరించారు. విద్యవల్లనే మానవుడు ఈ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాడని విశదీకరించారు. ప్రశ్నోత్తరాలతో విద్యార్థులను ఆలోచింప జేస్తూ వారి నుండి సమాధానాలను రాబడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా తమ ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రసంగంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ సంభాషించడం వల్ల ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కళాశాల అభివృద్ధి కోసం విద్యాసాగర్ గారి శిష్యులు 50,000/- రూపాయలు విరాళం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

జీవన నైపుణ్యాలు – వ్యక్తిత్వ వికాసం

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూన్ 23 శనివారం ‘జీవన నైపుణ్యాలు – వ్యక్తిత్వ వికాసం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారు అధ్యక్షత వహించగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాదిరాజు పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యక్తిత్వ వికాసంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. మనో విజ్ఞానశాస్త్రవేత్తగా, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆమె తమ అనుభవాలు వివరించారు. సరైన ఆరోగ్యం, ఆలోచనలు, అధ్యయనం సత్ప్రవర్తన వల్ల ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాయని డాక్టర్ జి. పద్మజ సోదాహరణంగా వివరించారు. మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలిపారు. వాగ్భూషణం భూషణం అంటూ మాటతీరు, ఆచరణ విధానం సవ్యంగా ఉండాలని సోదాహరణంగా వివరించారు. మానవ సంబంధాలు ఆదర్శవంతంగా, ఆరోగ్యకరంగా, ఆలోచనాత్మకంగా ప్రగతిదాయకంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఆమె సంధించిన ప్రశ్నావళి విద్యార్థులను ఉత్తేజపరిచాయి. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ యం. శరచ్చంద్ర మాట్లాడుతూ సంగీతం సకల మానవాళికి మానసిక ఆనందం కలిగిస్తుందని వివరించారు.

జిల్లెళ్ళమూడి కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని సోదాహరణంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగాచార్యులు డా॥ కె. సత్యమూర్తి మాట్లాడుతూ అష్టాంగ యోగా విధానాలు ఆరోగ్యప్రదాయకమని తెలిపారు. శరీరాన్ని మనసుతో సమన్వయం చేసే ప్రక్రియ యోగా అని వివరించారు. ద్యాసే ధ్యానం అని, మౌనం అంటే సంకల్ప వికల్ప రహిత స్థితిలో ఉండడమని అమ్మ సూత్రీకరించినట్లు వివరించారు. ద్వంద్వమును ద్వంద్వముతో జయించటం యోగమని ద్వంద్వము నుండి ఏకత్వము సాధించటానికి యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ వేదికపై యోగా శిక్షకురాలు ఎమ్. వాహిని మాట్లాడుతూ ఆసనాలు ధ్యానం ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా తెలిపారు. వేదికపై విద్యార్ధినీ విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి అందరిని అలరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల సంస్కృత అధ్యాపకులు డా॥ ఎ. హనుమత్ ప్రసాద్ గారు స్వాగతం పలికి వివిధ అంశాలను వ్యాఖ్యానించి వందన సమర్పణ నిర్వహించారు. యోగసాధనను నిరంతర ప్రక్రియగా పాటించి ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతులుగా వర్థిల్లాలని కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు శ్వేత హితవు పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

“అమ్మలో అమ్మ”

ఆధ్యాత్మిక ధార్మిక పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన “మానసిక స్థితికి తోడ్పడుతాయని ‘అమ్మలో అమ్మ‘ గ్రంథకర్త వేదాద్రి కేంద్రం నిర్వాహకులు, విశ్రాంతి అధ్యాపకులు అయిన స్వామి విరజా నందగిరి వివరించారు. ఈనెల 10వ గురువారం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సభలో అమ్మ గ్రంధావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉభయ పరిషత్తుల తరపున శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొని ప్రసంగించారు. కరస్పాండెంట్ శ్రీ.పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ అమ్మ అందరికీ  మార్గదర్శకమని వివరించారు. శ్రీ బ్రహ్మాండం రవీంద్ర గారు మట్లాడుతూ అమ్మ మాటలు నిత్యసత్యాలని తెలిపారు. ప్రధాన వక్త E.C member  శ్రీ యమ్. దినకర్ మాట్లాడుతూ చైతన్యస్వరూపిణి అయిన అమ్మ తత్వాన్ని అర్థంచేసుకొని ప్రగతిపథంలో పయనించాలని హితువు పలికారు. కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డా॥బి.ఎల్. సుగుణ మాట్లాడుతూ విశ్వంలోని సమస్త ప్రాణికోటీ అమ్మకు సమానమేనని సోదాహరణంగా తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథకర్త తె. నందగిరి స్వామిని కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామవంశీ  ఘనంగా సత్కరించారు