కళాశాల వార్షికోత్సవ సంబరాలు

అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21.2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. అమ్మ భక్తులైన శ్రీ యమ్. చంద్రమోహన్ గారు పిడి (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మెడల్స్ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరు నుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణగారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

తిరుపతిలో అమ్మ అనంతోత్సవాలు

12-6-19 న కుష్ఠురోగుల వైద్యశాల, కరకంబాడీ రోడ్ తిరుపతిలో వృద్ధులకు అమ్మ అన్నప్రసాదము, పళ్ళు అందజేశారు. ఈ మహత్కార్యంలో అమ్మ సేవలో అమ్మ అనంతోత్సవ యజ్ఞంలా ఎమ్. హైమవతి, ఎమ్.వి.ఎన్. రవిచంద్ర గుప్త, శ్రీ ఎమ్. రామకృష్ణాంజనేయులు ప్రభృతులు పాల్గొన్నారు.

హేమవతీ దేవి జయంతి వేడుకలు

హైమవతీదేవి 77వ జయంతి ఉత్సవాలు ది. 18-11-2019న కన్నులపండుగగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా  లలితా కోటి నామ పారాయణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7 గంటలకు లలితా కోటి నామ పారాయణను రామాయణ రసభారతి బ్రహ్మ శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు సభలో ఆరంభించారు. పలువురు భక్తులు గ్రామాలనుండి  విచ్చేసి లలితా కోటిలో పాల్గొన్నారు. పారాయణ యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. అంతకుముందు ది. 14-11-2019 నుండి హైమవతీదేవికి వివిధ అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఏకాంతంగా అన్నపూర్ణార్ణాలయంలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేశారు.

వినాయక చవితి వేడుకలు

మాతృ గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 4.09 2019 వరకు ఘనంగా జరిగాయి. అధ్యాపకుల సూచనలతో విద్యార్థినీ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో విద్యార్థి గణపతి ప్రతిమకు శాస్త్రోక్త విధానాలతో పూజలు జరిపారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమములో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు కళాశాల పూర్వ విద్యార్థి ఉన్నవ గణేష్ శమంతకోపాఖ్యానమును శ్రోతకులకు వినిపించారు. అదేరోజు పోలూరి శ్రీకాంత్(పూర్వ విదార్థి) తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకొన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో భరద్వాజ్ నృత్యాలు ప్రదర్శించి చూపరులను అలరించారు. అలాగే కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దూరదర్శన్ దూకుడు, బాల్యవివాహాలు, తెలివైన యజమాని తింగరి పనిమనిషి, భాషతెచ్చిన తంటాలు, మూకీ డ్రామా, జై జవాన్ జై కిసాన్ మొదలైన హాస్య నాటికలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. సినీ పాటల నృత్యాలు విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. పూర్వ విద్యార్థి దామోదర గణపతి తన జానపద పాటలతో పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. మూడవ రోజు గణపతిబప్పా మోరియా అంటూ గణేష్ నినాదాలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో క్రమశిక్షణతో, ఐకమత్యముతో వినాయకచవితి వేడుకలను జయప్రదం చేశారు.

గణపతి ఉత్సవాలు

గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి సంస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 409 2019 వరకు ఘనంగా జరిగాయి. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకుల సూచనలలో విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి ప్రతిమకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పలు కార్యక్రమాలు నిర్వహించారు.

గురుపౌర్ణమి

సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని ఉభయపరిషత్తుల జనరల్ సెక్రెటరీ శ్రీదేశిరాజు కామరాజుగారు వివరించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 16వ తేదీ మంగళవారం వాత్సల్యాలయంలో జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన తమ సందేశం అందించారు. ఇదే వేదికపై అమ్మ భక్తులు టి.టి. అప్పారావు గారు అజ్ఞానాన్ని పారద్రోలి సమాజాన్ని జ్ఞానకాంతులతో ప్రకాశింప జేసే గురువుకు సమాజంలో సమున్నత స్థానం లభించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అధ్యాపకులు డాక్టర్ కె.వి.కోటయ్యగారు. మాట్లాడుతూ గురుపౌర్ణమి అందించే సందేశాన్ని విద్యార్థులు త్రికరణశుద్ధిగా పాటించాలని హితవు పలికారు. గురుపౌర్ణమిలో ప్రధాన కార్యక్రమముగా అమ్మ జీవితచరిత్ర పారాయణాన్ని బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవాలని జ్ఞానకాంతులు ప్రకాశించాలని కోరుతూ పెద్ద ఎత్తున అమ్మ భక్తురాలు అయిన సుబ్బలక్ష్మిగారి పర్యవేక్షణలో దీపాలంకరణ నిర్వహించారు.