అమ్మ ఆగమనోత్సవం – బాలుర వసతిగృహంలో:

21.2.2021 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు కళాశాల అనసూయేశ్వర వసతి గృహంలో ఆదివారం నాడు అమ్మ ఆగమనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో శ్రీ విశ్వజననీ పరిషత్ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ప్రెసిడెంట్ యమ్. దినకర్గారు, జనరల్ సెక్రటరీ డి.వి.యన్. కామరాజు గారు మరియు కమిటీ సభ్యులు పి. గిరిధర్ కుమార్ గారు, చక్కా శ్రీమన్నారాయణగారు, టి. మురళీధర్ గారు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రంగవల్లులతో పచ్చని తోరణాలతో కన్నులపండుగగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు లలితాసహస్రనామ పారాయణ చేసి ప్రసాదవితరణతో కార్యక్రమాన్ని ముగించారు

అమ్మ ఆగమనోత్సవం – బాలికల వసతిగృహంలో:

20-2-2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ శనివారం అమ్మ ఆగమనోత్సవం వైభవంగా జరిగింది. పచ్చని తోరణాలతో, రంగవల్లులతో, పుష్పాలతో ఎంతో అందంగా వసతిగృహాన్ని అలంకరించారు. విద్యార్థినులు అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. లలితా సహస్రనామ పారాయణ చేశారు. కార్యక్రమంలో సంస్థపెద్దలు విశ్వజననీ ట్రస్టు అధ్యక్షులు ఛైర్మన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, వసుంధరక్కయ్య, కళాశాల అధ్యాపక బృందం, ఆవరణలో పలువురు పెద్దలు విచ్చేసి అమ్మకు నమస్కరించి విద్యార్థినులను ఆశీర్వదించారు.

కళాశాల వార్షికోత్సవ సంబరాలు

అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21.2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. అమ్మ భక్తులైన శ్రీ యమ్. చంద్రమోహన్ గారు పిడి (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మెడల్స్ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరు నుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణగారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

తిరుపతిలో అమ్మ అనంతోత్సవాలు

12-6-19 న కుష్ఠురోగుల వైద్యశాల, కరకంబాడీ రోడ్ తిరుపతిలో వృద్ధులకు అమ్మ అన్నప్రసాదము, పళ్ళు అందజేశారు. ఈ మహత్కార్యంలో అమ్మ సేవలో అమ్మ అనంతోత్సవ యజ్ఞంలా ఎమ్. హైమవతి, ఎమ్.వి.ఎన్. రవిచంద్ర గుప్త, శ్రీ ఎమ్. రామకృష్ణాంజనేయులు ప్రభృతులు పాల్గొన్నారు.

వినాయక చవితి వేడుకలు

మాతృ గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 4.09 2019 వరకు ఘనంగా జరిగాయి. అధ్యాపకుల సూచనలతో విద్యార్థినీ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో విద్యార్థి గణపతి ప్రతిమకు శాస్త్రోక్త విధానాలతో పూజలు జరిపారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమములో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు కళాశాల పూర్వ విద్యార్థి ఉన్నవ గణేష్ శమంతకోపాఖ్యానమును శ్రోతకులకు వినిపించారు. అదేరోజు పోలూరి శ్రీకాంత్(పూర్వ విదార్థి) తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకొన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో భరద్వాజ్ నృత్యాలు ప్రదర్శించి చూపరులను అలరించారు. అలాగే కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దూరదర్శన్ దూకుడు, బాల్యవివాహాలు, తెలివైన యజమాని తింగరి పనిమనిషి, భాషతెచ్చిన తంటాలు, మూకీ డ్రామా, జై జవాన్ జై కిసాన్ మొదలైన హాస్య నాటికలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. సినీ పాటల నృత్యాలు విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. పూర్వ విద్యార్థి దామోదర గణపతి తన జానపద పాటలతో పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. మూడవ రోజు గణపతిబప్పా మోరియా అంటూ గణేష్ నినాదాలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో క్రమశిక్షణతో, ఐకమత్యముతో వినాయకచవితి వేడుకలను జయప్రదం చేశారు.

“అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ

వార్తలు ఆధ్యాత్మిక, ధార్మిక, పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన మానసిక స్థితికి తోడ్పడుతాయని “అమ్మలో అమ్మ” గ్రంథకర్త వేదాద్రి బ్రహ్మజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, విశ్రాంత అధ్యాపకులు అయిన స్వామి ఓంకారానందగిరి వివరించారు. ఈ నెల 10వ తేదీ గురువారం వాత్సల్యాలయం సమావేశమందిరంలో జరిగిన సభలో తాను రచించిన “అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. వసుంధరక్కయ్య జ్యోతి ప్రజ్వలనం చేశారు. ప్రిన్సిపాల్ శ్రీ సుధామవంశి ప్రారంభించారు. ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు ఈ సభకు అధ్యక్షత వహించగా కరస్పాండెంట్ శ్రీపి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్గారు. చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, గ్రంథావిష్కరణ చేశారు. విశ్రాంత్ర ప్రిన్సిపాల్ డా. బి.యల్.సుగుణ, అమ్మభక్తులు టి.టి. అప్పారావు శ్రీ యం. దినకర్ తదితర ప్రముఖులు ప్రసంగించారు