పదవీ విరమణ మహోత్సవసభ

అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ ప్రగతిపధంలో నడిపించారని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆగష్టు 31 శుక్రవారం జిల్లెళ్ళమూడిలో జరిగిన డాక్టర్ బి.యల్.సుగుణగారి ఉద్యోగ విరమణ సమావేశంలో అధ్యక్షులుగా ప్రవచన సమ్రాట్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ముఖ్య అతిధులుగా, సంస్థ చీఫ్ ప్యాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావుగారు ఆత్మీయ అతిధిగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు గౌరవ అతిధులు, యాక్టింగ్ ప్రెసిడెంట్ శ్రీ యన్.లక్ష్మణరావుగారు, స్థానిక కార్యదర్శి శ్రీ బి. రామచంద్ర, కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె.వి.కోటయ్య తదితరులు ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా విద్యాబోధనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించిన డాక్టర్ బి.యల్.సుగుణగారిని అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పుష్పార్చనతో జేజేలు పలుకుతూ ఆమెను వేదిక వద్దకు ఆహ్వానించారు. తనకు జరిగిన సన్మానానికి డా.బి.యల్. సుగుణ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, వారి ఉన్నతి కోసం విద్యాబోధనతో పాటు వివిధ ఉద్యోగపోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం, వారిని సన్మార్గంలో నడిపించడం, తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. విద్యార్థులలో సేవాగుణం, పరోపకారబుద్ధి, త్యాగ భావన వర్థిల్లేలా తమ వంతు సేవలను అందించినట్లు వివరించారు. తన ఉద్యోగ విరమణ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రగతి కోసం 3,00,000ల రూపాయిలను ఆమె కళాశాలకు అందించారు.

తెలుగు భాషా దినోత్సవము

కళాశాలలో 29.8.2018న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు, మన కళాశాల పూర్వవిద్యార్థి శ్రీ శేషాద్రి మాట్లాడుతూ ప్రపంచంలో అజంత భాషలెన్ని ఉన్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ భాషలోని పదాలనైనా తెలుగులోకి చాలా సులభంగా స్వీకరించవచ్చని ఉదాహరణ పూర్వకంగా తెలియజెప్పారు. | తెలుగు భాషకే సొంతమైన అవధానప్రక్రియ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు వ్యవహార భాషోద్యమకారులైన గిడుగువారి కృషిని శ్లాఘిస్తూ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ మధుసూదనరావుగారు, కె.వి. కోటయ్య గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణగారు మాట్లాడారు. ఈ కార్యక్రమములో భాగంగా శోభన, అనూష అల్లసాని పెద్దనగారు రచించిన ఉత్పలమాలికను ఆశువుగా చెప్పారు. నంబూరు జడ్.పి. హైస్కూల్ విద్యార్థులైన షేక్నిగా, షేక్ సాహెబ్ పోతన నృసింహావతార ఘట్టము లోని గద్యమును అనర్గళముగా పఠించారు.

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 29-8-2018 న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నంబూరు జడ్.పి.హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి గారు విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.యల్ సుగుణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ భాషలోని పదాలనైనా తెలుగులో చాలా సులభంగా స్వీకరించవచ్చని ఉదాహరణ పూర్వకంగా శేషాద్రి తెలియజెప్పారు. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు వ్యావహారికభాషోద్యమకారులైన గిడుగువారి కృషిని తెలుగు ఉపాధ్యాయులు డా. మధుసూదనరావు గారు కొనియాడారు. కె.వి.కోటయ్య గారు ప్రసంగిస్తూ అమ్మభాషను నేర్చుకోకుండా పరభాషను నేర్చుకోలేమని ఆంగ్లకవి అన్నవిషయాన్ని గుర్తుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ గారు భాష గొప్పదనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శోభన, అనూషలు పెద్దన్నగారు రచించిన ఉత్పలమాలను ఆశువుగా చెప్పారు. నంబూరు జెడ్.పి హైస్కూల్ విద్యార్థులైన షేక్ హసీనా, షేక్ పాపాంచ్, పోతన రచించిన గద్యమును అనర్గళంగా పఠించారు. గిడుగువారి కీర్తిని విద్యార్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆసాంతం విద్యార్థులచే నిర్వంచబడింది.

సమాజంలో మానవీయ విలువలు (స్ఫూర్తి కార్యక్రమము)

ప్రభాకరస్వామివారు (హైదరాబాద్) కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాభావము, పరస్పర సహకారం, త్యాగభావనవల్లనే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కారవంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యంగా ప్రబోధించారు.

మానవీయ విలువలు – స్ఫూర్తి

ఐక్యభావన వల్లనే సమాజం పురోగమిస్తుందని ప్రభాకర స్వామి (హైదరాబాద్) వివరించారు. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సేవాభావం, పరస్పర సహకారం, త్యాగభావం వల్లే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కార వంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యమని ప్రబోధించారు. వైషమ్యాలు, విద్వేషాలు, దురాలోచనలు, హింస, స్వార్థం సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరించారు. మన సంస్కృతి, సమాజం గొప్పదనాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. భారతీయుల ఉత్తమ సంస్కృతి ప్రపంచాన్ని ఆకట్టుకుందని, అందువల్ల మన సంస్కృతి ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రబోధించారు. సత్సంప్రదాయాలను కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రభాకర స్వామివారి ప్రసంగం  విద్యార్థినీ విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుగుణగారు, ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.