విజయవంతంగా సంస్కృత సంభాషణ

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్ ఆంజనేయులు గారు వివరించారు. జూలై 12 వ తేదీ శుక్రవారం కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ భాషలలో సంస్కృతానికి సముచిత స్థానం లభించడానికి ఆనాటి సంస్కృత వాఙ్మయమే ప్రధాన కారణమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.వి. సుధామ వంశీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబు మాట్లాడుతూ సంస్కృత భాషా శిబిరాలను తరచుగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వేదాలు, ఉపనిషత్తులు, సారస్వత వాఙ్మయం, సంస్కృత భాషలోనే ఉందని వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో సంస్కృత భాషను సమగ్రంగా నేర్చుకోవడానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంస్కృత అధ్యాపకులు డా అన్నదానం. హమమత్ ప్రసాద్ గారు. స్వాగతం పలుకగా, సంస్కృత అధ్యాపకులు డా. పావని వందన సమర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు సంస్కృతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

అమ్మ ఆశీస్సులతో నూతన విద్యా సంవత్సరం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 2019-20 విద్యా సంవత్సరం ది. 10.6.2019 సోమవారం నాడు ప్రారంభమైనది. ఈ సందర్భంగా అమ్మ ఆలయంలో కళాశాల అభివృద్ధికై పూజను నిర్వహించారు. అమ్మ పాదాల చెంత వార్షిక పుస్తకాలను ఉంచి లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఉభయ పరిషత్ ల అధ్యక్షులు శ్రీ. ఎమ్. దినకర్ గారు, రాము గారు, కామరాజు గారు, శ్రీరామమూర్తి గారు తదితర పెద్దలు మరియు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.సుధామ వంశీ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే వేడుకలు

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమిషనర్ అధికారి జి.వి.జి కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సుధామ వంశీ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశమనీ, మన దేశ గౌరవాన్ని ఇనుమడింప జేసే విధంగా విద్యార్థులు ఉండాలని హితవుపలికారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడి గ్రామంలో పతాకావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ బ్రహ్మాండం రవీంద్ర రావు గారు, మేనేజింగ్ ట్రస్ట్ యమ్. దినకర్ గారు, శ్రీరామమూర్తి గారు, శ్రీ రామ చంద్రగారు, శ్రీమన్నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పలు దేశభక్తి గీతాలను ఆలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ ప్రేమకుమార్ గారు తమ సందేశాన్ని అందించారు.

“అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ

వార్తలు ఆధ్యాత్మిక, ధార్మిక, పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన మానసిక స్థితికి తోడ్పడుతాయని “అమ్మలో అమ్మ” గ్రంథకర్త వేదాద్రి బ్రహ్మజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, విశ్రాంత అధ్యాపకులు అయిన స్వామి ఓంకారానందగిరి వివరించారు. ఈ నెల 10వ తేదీ గురువారం వాత్సల్యాలయం సమావేశమందిరంలో జరిగిన సభలో తాను రచించిన “అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. వసుంధరక్కయ్య జ్యోతి ప్రజ్వలనం చేశారు. ప్రిన్సిపాల్ శ్రీ సుధామవంశి ప్రారంభించారు. ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు ఈ సభకు అధ్యక్షత వహించగా కరస్పాండెంట్ శ్రీపి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్గారు. చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, గ్రంథావిష్కరణ చేశారు. విశ్రాంత్ర ప్రిన్సిపాల్ డా. బి.యల్.సుగుణ, అమ్మభక్తులు టి.టి. అప్పారావు శ్రీ యం. దినకర్ తదితర ప్రముఖులు ప్రసంగించారు

వినాయక చవితి వేడుకలు (13-9-2018 నుండి 15-9-2018)

డా॥ జయంతి చక్రవర్తి ఆధ్వర్యంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల ఆధ్వర్యంలో గణేశ ఉత్సవాలు సెప్టెంబరు 13, 14, 15 తేదీలలో ఘనంగా జరిగాయి. మాతృశ్రీ సంస్థ ప్రాంగణంలోని టి.టి.డి. కళ్యాణమండపంలో 13వ తేదీ ఉదయం విశేష పూజలు ఘనంగా జరిగాయి. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్, వసుంధరక్కయ్య, స్థానిక కార్యదర్శి శ్రీ భట్టిప్రోలు రామచంద్రగారు, డాక్టర్ బి.యల్. సుగుణగారు, అధ్యాపక ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శమంతకోపాఖ్యానం, విద్యార్థినుల భక్తిగీతాలు, సాయంత్రం పూజా కార్యక్రమం పద్యనివేదనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థినుల నృత్యప్రదర్శన కళాశాల విద్యార్థినుల నాటికలు ప్రదర్శంచబడ్డాయి. 14వ తేదీ పూజా కార్యక్రమం తరువాత విద్యార్థినులు పద్యపఠనం చేశారు. ఓంకారానందగిరిగారు వినాయక ప్రాశస్త్యం గురించి వివరించారు. మంగళగిరి నుండి వచ్చిన మధురిమ, అఖిల (5వ తరగతి) నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. అదేరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నవ్వుల జల్లులు, పెళ్ళిగోల, కార్పోరేట్ వైద్యం, దశావతారం నృత్యం, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ తదితర నాటికలను ప్రదర్శించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థినులు స్నేహంతో రా స్కిట్న ప్రదర్శించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. విద్యార్థులు సినిమా సందడి స్కిట్ నవ్వులజల్లు కురిపించింది. 15వ తేదీ ఉదయం పూజాకార్యక్రమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో గణేశ నిమజ్జనం నిర్వహించారు.

వైభవంగా గురుపూర్ణిమ

విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించే సత్సంప్రదాయానికి వేదిక గురుపూర్ణిమ అని ప్రముఖ సాహితీవేత్త ప్రవచన కళానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వివరించారు. జులై 29 శుక్రవారం అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో జరిగిన గురుపౌర్ణమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువును పూజించడం ప్రతి ఒక్కరి ధర్మమని వివరించారు. అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదించే గురువును పూజించి ప్రతి ఒక్కరూ జన్మను సార్థకం చేసుకోవాలని మల్లాప్రగడ హితవు పలికారు. కార్యక్రమంలో భాగంగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణగారిని ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వజనని అమ్మ దివ్యచరిత్ర మహోదధిలో తరంగాలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు.గురుపౌర్ణమి సందర్భంగా అమ్మభక్తురాలు సుబ్బలక్ష్మిగారు పలువురు అమ్మ భక్తులు, అభిమానులు, విద్యార్థినీ విద్యార్థులు దీపోత్సవం నిర్వహించారు. అజ్ఞానాంధకారం అంతరించి విజ్ఞానకాంతులుగా ప్రకాశించాలని కోరుతూ అమ్మని ప్రార్థించారు.