by admin | Feb 21, 2019 | International Commemorative Days
21.2.2019 న ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత భాషాభిమానులపై ఉందని, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ వివరించారు. ఫిబ్రవరి 21 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా ప్రశస్తిని సోదాహరణంగా వివరించారు. బెంగాళీలు తమ మాతృభాషను కాపాడుకోవడానికి చేసిన ప్రాణత్యాగాలను వివరించారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్య గారు మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగు పద్యం ఆద్యంతం హృద్యమనీ చెబుతూ తెలుగు పద్యంలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని విపులీకరించారు. కాగా ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు డా॥ మడకా సత్యనారాయణ గారు నిర్వహించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మాతృ భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు జేజేలు పలికారు. పి.డి.సి. ప్రథమ సంవత్సరం (సంస్కృతం) విద్యార్థిని వసంత, పి.డి.సి. ద్వితీయ సంవత్సరం గోవింద్ తదితరులు ఈ సభలో మాట్లాడారు.
by admin | Feb 21, 2019 | International Commemorative Days
ఫిబ్రవరి 21 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభలో మాతృభాష విజ్ఞానమయకోశానికీ, ఆనందమయకోశానికీ ఉత్ప్రేరకమని డా.కె.సత్యమూర్తిగారు మాతృభాష ఆవశ్యకతను, ఔన్నత్యాన్ని విశదీకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకమిత్రులు విద్యార్థులు పాల్గొన్నారు. అధ్యక్షులు తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగులోని మాధుర్యాన్ని హృద్యమైన పద్యాలలో దాగి ఉండే అంతరార్థాన్ని తెలియజెప్పారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు, పూర్వ విద్యార్థి శ్రీ పి. మధుసూదన్ గారు మాట్లాడుతూ ప్రాచ్య కళాశాలను స్థాపించడంలో అమ్మ యొక్క దూరదృష్టి, దివ్యదృష్టి అగణితమైనదని, అమ్మ ఆశయాలు భాషాభిమానుల ద్వారా నేడు నెరవేరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖాధ్యక్షురాలు డా.యల్. మృదుల నిర్వహించగా కె. వెంకటేష్ వందన సమర్పణ ఈ చేశారు. కార్యక్రమంలో పి.డి.సి ప్రథమ సంవత్సరం చదువుతున్న యమ్. మనస్విని, సంస్కృత విద్యార్థి మలయప్ప, బి.ఏ. ఫైనల్ ఇయర్ విద్యార్థిని పూర్ణిమ, పైనల్ ఇయర్ విద్యార్థి మురళి తెలుగు భాష ఔన్నత్యాన్ని తమ మాటలలో వివరించారు. శోభనా సులభాగతి పోతన ఉత్పలమాలికను శ్రావ్యంగా ఆలపించింది. అదేవిధంగా బి.ఏ. సెకండ్ ఇయర్ విద్యార్థి అంజనేయులు నృసింహావతార ఘట్టాన్ని హావభావాలతో ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది