త్రిమూర్త్యాత్మకమైన అమ్మ నడియాడిన అర్కపురి సరస్వతీ క్షేత్రం అని కందుకూరి సత్య సూర్యనారాయణ గారు అన్నారు.
ఆగస్టు 29 మంగళవారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గిడుగు రామ్మూర్తి పంతులు గారి 160 వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ సభా కార్యక్రమం జరిగింది.
ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యనారాయణ గారు ప్రసంగిస్తూ వేదవాఙ్మయాన్ని, లౌకిక వాఙ్మయాన్ని అందించిన ఋషుల జ్ఞాన భాండాగారాన్ని నన్నయ భారతాంథ్రీకరణంతో, ప్రబంధకవుల రచనలతో పండితులు తెలుగు పదజాలాన్ని జనావళిలోకి తీసుకురాగలిగారు. పండిత పామర జనరంజకం గా ఉండేలా గిడుగు వారు చేసిన భాషా ఉద్యమం ఆందరికీ స్పూర్తిదాయకమని కొనియాడారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్ష భాషణ చేస్తూ భాషా పరిరక్షణ ఓరియంటల్ కళాశాలల పై ఉందని అందుకు తగిన వారసులు గా మన విద్యార్థులు విద్యను అభ్యసించాలని కోరారు.
అనంతరం తెలుగు అధ్యాపకులు పి. మధుసూదనరావు గారు మాట్లాడుతూ వ్యవహారభాష గ్రంథస్థం చేసిన ఘనత గిడుగు వారిదని చెప్పారు.
బి. శక్తిధర్ గారు ముఖ్య అతిథి సూర్యనారాయణ గారి సంక్షిప్త పరిచయం చేస్తూ పుంభావ సరస్వతి గా సంస్కృతాంధ్ర భాషా పండితులు గా వారు ఆంధ్ర నాట ఘన కీర్తిని పొందారని తెలిపారు.
అధ్యాపకులు ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు తెలుగు పద్యాలాపన తో, ప్రసంగాలతో, నృత్య ప్రదర్శనలతో గిడుగు వారి కృషిని తెలుగు లోని మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్ లక్కవరపు మృదుల సభానిర్వహణ చేయగా వీరాంజనేయులు వందన సమర్పణ చేశారు.
శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.
Telugu Bhasha Dinothsavam