International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగేన యోగో జ్ఞాతవ్యో – యోగో యోగాత్ ప్రవర్తతే !
యో2ప్రమత్తస్తు యోగేన – స యోగీ రమతే చిరమ్ !!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం పక్షాన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో ప్రిన్పిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణం చేస్తూ యోగా అనేది మానసిక, శారీరక రుగ్మతలనుండి దూరం చేయగలదని వివరించారు. ముఖ్యంగా స్రీలకు వచ్చే అనారోగ్యాలు సులభమైన ఆసనాలతో నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి అనూష గారు అష్టాంగయోగాలను సవివరంగా తెలిపి ప్రత్యక్షంగా ఆసనాలు వేసి ప్రాణాయామాలలో రకాలను తెలిపి వాటిద్వారా అనేక రుగ్మతలకు ఉన్న నివారణోపాయాలను వివరించారు. నిత్యజీవితంలో యోగాతో అనుబంధం కలిగి ఉంటే రోగాలతో బంధ హీనులం కావచ్చని సూచించారు. ఆధునిక మానవ జీవన శైలి లో యోగాభ్యాసాన్ని అలవరచుకున్నట్లైతే చిరకాలం జీవించగలమన్నారు. హిస్టరీ ఉపన్యాసకులు శ్రీ పి. సుందరరావు గారు సభాసంచాలనం చేస్తూ యోగా ప్రత్యేకతను గుర్తించి గత పది సంవత్సరాలుగా అనేకవిధాలైన కాన్సెప్ట్ లతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ముదావహమని తెలిపారు. అనంతరం విద్యార్థుల యోగాసనాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.