+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21:2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్ళమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజనని పరిషత్ కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ జి.వై.యస్.బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవానికి ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్షత వహించారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ మన సంప్రదాయాలను కాపాడుతూ అమ్మతత్త్వాన్ని దశదిశలా వ్యాప్తి చేసి, భావితరాలకు అందించాలని కోరారు. విద్యార్థి జీవితంలో ఈ వార్షికోత్సవాలు ఒక మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని, భవిష్యత్తులో ఈ సంస్థ అభివృద్ధికి అమ్మ ఆశయాలకు అనుగుణంగా పూర్వవిద్యార్థి సంఘం నిలుస్తుందని ప్రిన్సిపాల్ హనుమంతయ్య గారు ఆశాభావం వ్యక్తం చేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. యమ్. చంద్రమోహన్ గారు (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మోడల్స్ ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరునుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణ గారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్ధులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో సంస్థపెద్దలు వై.వి. శ్రీరామ్మూర్తిగారు, మోహనకృష్ణ గారు, చక్కా శ్రీమన్నారాయణగారు పాల్గొని తమ ఆశీస్సులను విద్యార్థులకు అందించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు  అందరినీ అలరించాయి.