పేరెంట్స్ టీచర్స్ మీట్

12.11. 2022 శనివారం వాత్సల్యాలయంలో కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ పి.గిరిధర్ కుమార్ గారు, డాక్టర్ బి.ఎల్ | సుగుణ గారు, ప్రిన్సిపల్ ఆర్.వరప్రసాద్ గారు, శ్రీ ఎం.దినకర్ గారు, డా॥ యు. వరలక్ష్మి గారు, చిన్నంనాయుడు గారు, రావమ్మ గారు పాల్గొన్నారు. వరప్రసాద్ గారు కళాశాల లక్ష్యాలు పురోగతి ప్రగతి నివేదికలను అందించారు. | సుగుణ గారు మాట్లాడుతూ విద్య కేవలం బతుకు తెరువు కోసమే కాదు జీవిత పరమార్ధాన్ని కూడా తెలుపుతుంది. క్రమశిక్షణతో వివేకంతో మన కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరొంది | ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అమ్మ భావాలకు వారసులై నిలిచా రని అన్నారు.
అనంతరం అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారు మాట్లాడుతూ “ఇలాంటి వేదికలు ఎన్నో జరగాలని సూచించారు. కళాశాల ప్రస్తుత స్థితిని శ్రీ ఎం. దినకర్ గారు వివరించారు. |అనంతరం డాక్టర్ యు. వరలక్ష్మి గారు మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం వలన మీ పిల్లలను | ఉత్తమంగా తీర్చి దిద్దేందుకే ఈ కళాశాలలో చేర్పించారాని, మన విద్యార్థులు ఉత్తమ పౌరులు కాగలరని తల్లిదండ్రుల నుద్దేశించి పలికారు. గిరిధర కుమార్ గారు మాట్లాడుతూ సమావేశంలో ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. చిన్నంనాయుడు గారు అమ్మ ప్రేరణ మాలో అమృత వాయువులను ప్రవహింప జేస్తుంది కాబట్టే పూర్వ విద్యార్థులమైన మేము పార్వతీపురంలో నిత్యం అన్నప్రసాద వితరణ చేయగలుగుతున్నాము అన్నారు. పూర్వ విద్యార్థిని రావమ్మ గారు మాట్లాడుతూ తాను తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండేలా జీవితాన్ని అందించిన అమ్మకు నమస్సులు తెలిపారు. మొక్క ఎన్నో ఫలాలను ఇచ్చినా మూలం భూమిలోనే ఉంటుంది గనుక విద్యాఫలాలను అందుకున్న వారు మాతృ సంస్థను మరవరాదని అన్నారు. కార్యక్రమంలో ఇంటర్న్ షిప్ ను సజావుగా నడిపించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శనం చేసిన శ్రీ ఓంకారానంద గిరి స్వామివారిని సన్మానించారు యాజమాన్యం వారు. రాబోయే అమ్మ శతజయంతి ఉత్సవాలకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. శాంతిమంత్రం పఠనంతో నాటి కార్యక్రమం ముగిసింది.

కళాశాల వార్తలు (వినాయక చవితి వేడుకలు)

మాతృ గణపతి ఉత్సవాలు టిటిడి కళ్యాణ మండపం జిల్లెళ్ళమూడిలో 31/8/2022 నుండి 3/9/2022 వరకు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొదటిరోజు విద్యార్థి గణపతికి శాస్త్రోక్త విధానంతో పూజలు జరిపారు. శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు శమంతకోపాఖ్యానాన్ని ప్రేక్షకులకు వినిపించారు. మూడు రోజుల పాటు విద్యార్థినీ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమంలో ఉదయం ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు శ్రీకృష్ణ కుచేల స్నేహబంధం అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు అమ్మ శేష వస్త్రాలతో మల్లాప్రగడ వారిని సత్కరించారు. మూడోరోజు ఉదయం బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకురాలు శ్రీమతి మైలవరపు లలిత కుమారి గారు మనుచరిత్ర అనే ప్రబంధం గురించి సోదాహరణంగా వివరించారు. శ్రీమతి బూదరాజు వాణి అక్కయ్య గారు లలిత కుమారి గారిని అమ్మ శేష వస్త్రాలతో సత్కరించారు. త్రిరాత్రి ఉత్సవాలలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన జాతి రత్నాలు, ఆడాళ్ళు మీకు జోహార్లు, డాక్టర్ 2.0, లేట్ కామర్స్, స్కూల్ బంక్, పెళ్లిచూపులు మొదలైన హాస్య నాటికలు చూపరులను అలరించాయి. బి. ఎ. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అమరకోశం శ్లోక కంఠ పాఠాన్ని వినిపించారు. సినీ పాటల నృత్యాలను ఎంతో చక్కగా ప్రదర్శించారు. నాలుగో రోజు ఉదయం గణేష్ మహరాజ్ కి జై అంటూ గణేశ నినాదాలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల వార్తలు (మాతృభాషా దినోత్సవం)

నాస్తికునిగా ఉన్న నన్ను ఆస్తికునిగా మార్చి అమ్మ దివ్య పాదాల అందెల రవళి లోని మాధుర్యాన్ని తనకు పరిచయం చేసిందని శ్రీ కోన రమణరావుగారు అన్నారు. ఆగస్టు 29వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన మాతృభాషా దినోత్సవ సభలో ప్రముఖ రచయిత చిత్రకారులు బహుముఖ ప్రజ్ఞాభూషణ శ్రీ కోన రమణరావుగారు మాట్లాడుతూ లక్ష మందికి ఏక పంక్తి లోఅమ్మ భోజనం పెట్టిన నాడు తాను పాల్గొన్నానని స్మరించుకున్నారు. అనంతరం బందా వేంకట కృష్ణశక్తిధర్ తెలుగు ఉపన్యాసకులు (చీరాల) తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే అనేక శాసనాలను ఉటంకిస్తూ భట్టిప్రోలు శాసనం మన తెలుగుభాష అజంత భాష అని తెలియజేసే శాసనంగా తీసుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ నారాయణం శేషుబాబు గారు తెలుగు ఉపన్యాసకులు ప్రసంగిస్తూ తెలుగు భాష ఒక పుష్పక విమానంలా మారుతున్న సమయంలో వ్యవహార భాషా ఉద్యమం మొదలైందని కనుకనే ఇంకా మన భాష మన జాతి వెలుగులో ఉన్నాయని విశ్లేషించి చెప్పారు. అనంతరం శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ తరఫున అతిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ కోన రమణరావు గారు పలు సాహిత్య గ్రంధాలను ఆంధ్రభారతి పెయిటింగ్ ను కళాశాల గ్రంథాలయానికి అందించారు. నారాయణ శేషుబాబు గారు ప్రాచీనాంధ్ర కథాకావ్యాలు – నీతి బోధ అనే తన శోధ ప్రబంధాన్ని విద్యార్థులకు మరియు గ్రంథాలయానికి కొన్ని ప్రతులను అందించారు.

ఆజాదీ కా అమృత మహోత్సవం

ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 13, 14 తేదీల్లో పలు దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు 13 వ తేదీ ఉ దయం చిత్రలేఖనం మధ్యాహ్నం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కళాశాల భవనంపై మువ్వన్నెల జండా ఎగురవేశారు. అనంతరం విశ్వజననీ టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యమ్. దినకర్ గారి చేతులమీదగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్యోద్యమకారుల చరిత్ర ప్రదర్శన ప్రారంభించబడింది. అదేరోజు మధ్యాహ్నం విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని కలిగించేలా గీతాలాపన కార్యక్రమం జరిగింది. 14వ తేదీ ఉదయం అమృతోత్సవ నినాదాలతో కళాశాల నుండి ర్యాలీ ప్రారంభమై జిల్లెళ్ళమూడి గ్రామంలో కొనసాగింది. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ అని గ్రామస్థులలో స్ఫూర్తి కలిగేలా విద్యార్థులు అధ్యాపకులు ఈ ర్యాలీని నిర్వహించారు.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల – విద్యా సంవత్సరం ప్రారంభం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2022 2023 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా 15.6.2022వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయంలో అమ్మకు అర్చన జరిగింది. SVJP ట్రస్టు పెద్దలు పాల్గొన్నారు. కరస్పాండెంట్ డా. బి. ఎల్. సుగుణ గారి ఆధ్వర్యంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందాలు, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు.