కళాశాల వార్తలు (మాతృభాషా దినోత్సవం)

నాస్తికునిగా ఉన్న నన్ను ఆస్తికునిగా మార్చి అమ్మ దివ్య పాదాల అందెల రవళి లోని మాధుర్యాన్ని తనకు పరిచయం చేసిందని శ్రీ కోన రమణరావుగారు అన్నారు. ఆగస్టు 29వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన మాతృభాషా దినోత్సవ సభలో ప్రముఖ రచయిత చిత్రకారులు బహుముఖ ప్రజ్ఞాభూషణ శ్రీ కోన రమణరావుగారు మాట్లాడుతూ లక్ష మందికి ఏక పంక్తి లోఅమ్మ భోజనం పెట్టిన నాడు తాను పాల్గొన్నానని స్మరించుకున్నారు. అనంతరం బందా వేంకట కృష్ణశక్తిధర్ తెలుగు ఉపన్యాసకులు (చీరాల) తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే అనేక శాసనాలను ఉటంకిస్తూ భట్టిప్రోలు శాసనం మన తెలుగుభాష అజంత భాష అని తెలియజేసే శాసనంగా తీసుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ నారాయణం శేషుబాబు గారు తెలుగు ఉపన్యాసకులు ప్రసంగిస్తూ తెలుగు భాష ఒక పుష్పక విమానంలా మారుతున్న సమయంలో వ్యవహార భాషా ఉద్యమం మొదలైందని కనుకనే ఇంకా మన భాష మన జాతి వెలుగులో ఉన్నాయని విశ్లేషించి చెప్పారు. అనంతరం శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ తరఫున అతిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ కోన రమణరావు గారు పలు సాహిత్య గ్రంధాలను ఆంధ్రభారతి పెయిటింగ్ ను కళాశాల గ్రంథాలయానికి అందించారు. నారాయణ శేషుబాబు గారు ప్రాచీనాంధ్ర కథాకావ్యాలు – నీతి బోధ అనే తన శోధ ప్రబంధాన్ని విద్యార్థులకు మరియు గ్రంథాలయానికి కొన్ని ప్రతులను అందించారు.

మాతృభాషా దినోత్సవం

తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల సంపదగా ప్రాచుర్యం పొందాలని ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీగారు ఆగష్టు 29న జరిగిన తెలుగు మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష ప్రజలభాషగా వర్ధిల్లాలని గిడుగు రామమూర్తి పంతులుగారు భాషోద్యమం నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల ఆంధ్రశాఖ ప్రతినిధి డా. ఎల్. మృదులగారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అధ్యాపకులు డా. కె.వి. కోటయ్య, సర్వశ్రీ మడకా సత్యనారాయణ, పి. మధుసూధనరావు, కె. శ్వేత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మాతృభాషా గీతాలను గానం చేశారు. గిడుగు రామమూర్తి చేసిన కృషిని వివరించి శ్రోతల మన్ననలు పొందారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గిడుగు రామమూర్తిపంతులు గారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ నిర్వహించి జేజేలు పలికారు