International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగేన యోగో జ్ఞాతవ్యో – యోగో యోగాత్ ప్రవర్తతే !
యో2ప్రమత్తస్తు యోగేన – స యోగీ రమతే చిరమ్ !!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష  గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం పక్షాన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో ప్రిన్పిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణం చేస్తూ యోగా అనేది మానసిక, శారీరక రుగ్మతలనుండి దూరం చేయగలదని వివరించారు. ముఖ్యంగా స్రీలకు వచ్చే అనారోగ్యాలు సులభమైన ఆసనాలతో నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి అనూష గారు అష్టాంగయోగాలను సవివరంగా తెలిపి ప్రత్యక్షంగా ఆసనాలు వేసి ప్రాణాయామాలలో రకాలను తెలిపి వాటిద్వారా అనేక రుగ్మతలకు ఉన్న నివారణోపాయాలను వివరించారు. నిత్యజీవితంలో యోగాతో అనుబంధం కలిగి ఉంటే రోగాలతో బంధ హీనులం కావచ్చని సూచించారు. ఆధునిక మానవ జీవన శైలి లో యోగాభ్యాసాన్ని అలవరచుకున్నట్లైతే చిరకాలం జీవించగలమన్నారు. హిస్టరీ ఉపన్యాసకులు శ్రీ పి. సుందరరావు గారు సభాసంచాలనం చేస్తూ యోగా ప్రత్యేకతను గుర్తించి గత పది సంవత్సరాలుగా అనేకవిధాలైన కాన్సెప్ట్ లతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ముదావహమని తెలిపారు.  అనంతరం విద్యార్థుల యోగాసనాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం)

“వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ ||
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ‘యోగా’ అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా Spiritual Master, HRM Trainer శ్రీమతి S.P.అన్నపూర్ణ గారు మరియు సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సిద్ధార్థ గారు పాల్గొన్నారు. సభలో శ్రీమతి అన్నపూర్ణ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ సాధకులకు, జిజ్ఞాసులకు ఆలవాలమైన మన భారతదేశంలో నాల్గవ శతాబ్దంలో పతంజలి మహర్షి యోగసూత్రాలను మనకు అందించారని యోగ సాధనతో సాధించలేనిది లేదని తెలియజేశారు. సత్యం, ధర్మం, శీలం అనే మూడు సూత్రాల కలయికతో జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని పొందాలని వివరించారు. శ్రీ సిద్దార్థ్ గారు తాను తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల గ్రామం నుంచి అందరినీ విద్యావంతులను చేయాలనే ఒక లక్ష్యంతో బయలుదేరి ముందుకు వెళుతున్న తనకు ఈరోజున మన ఆశ్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మ అందించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జ్ఞాన ప్రమిదలుగా అందరూ వెలుగొందాలని చెప్పారు. అనంతరం కళాశాల చరిత్ర అధ్యాపకులు P. సుందరరావుగారు మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యం ఉంటుందని, అది యోగా ద్వారానే సాధ్యమని పలు ఉదాహరణలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగ ఆవశ్యకత, షట్చక్రాలు, సూర్య నమస్కారాలు వంటి పలు అంశాలలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈపోటీలకు డా.A. హనమత్ప్రసాద్ గారు, శ్రీమతి.L.మృదుల గారు, శ్రీమతి.M.కవిత గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగు అధ్యాపకులు I.V.S. శాస్త్రి గారు సభానిర్వహణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు  కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు  ఋషులు మనకు అందించిన శాస్త్రాలలో యోగ శాస్త్రం ఒకటని తెలిపారు. మానవునిలోని షడ్చక్రాలను చైతన్య పరచడమే దీని లక్ష్యమని అష్టాంగ యోగంలో ప్రధానమైన ఆసన, ప్రాణాయామాల ద్వారా మనో నిగ్రహాన్ని కలిగించుకోగలమని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి ఓంకారానంద గిరిస్వామి గారు రచించిన *సుగతి యోగం* అనే పుస్తకాన్ని ప్రిన్సిపాల్ గారు ఆవిష్కరించారు. 

 గారు సుగతి యోగంలోని విషయాలను తెలియపరుస్తూ రచయిత జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్రను సంగ్రహించి వ్రాయ తలపెట్టిన తనకు అమ్మ జీవితమే ఒక దివ్య యోగంలా అనిపించి ఆమెను యోగమూర్తిగా దర్శించి దివ్యమైన అనంతమైన జీవిత పరమావధిని తెలుపుతూ ఈ పుస్తకాన్ని రచించినట్లుగా చెప్పారు. *ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే* అని చెప్పిన యోగశిఖోపనిషత్తుకు దగ్గరగా అమ్మ ‘ద్వంద్వాల మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉంద’ని తెలిపిందన్నారు. 

జాండ్రపేట నుంచి ప్రముఖ యోగాచార్యులు శ్రీ పద్మనాభుని తులసీరావు మాధవి దంపతులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారు విశిష్ట అతిథిని సభకు పరిచయం చేశారు. తులసీ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అందరిలో ఉండే ఉత్సాహమే ఉత్సవంగా మారుతుంది కనుక అందరూ చిన్నచిన్న యోగాసనాల ద్వారా ఆరోగ్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉండవచ్చునని తెలిపారు.  యోగ అంటే కలయిక ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ రెండింటిని సమతుల్యం చేసుకోగలిగితే మనలో ఉన్న అనంతమైన శక్తి బయటకు వస్తుందని వివరించారు. పార్టిసిపేటివ్ మెథడ్ అనుసరిస్తూ విద్యార్థులతో మాట్లాడిస్తూ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ద్వారా వచ్చే శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేలా చేశారు. మన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండగలదని  తెలిపారు. కార్యక్రమంలో సత్యమూర్తి గారికి తులసిరావు, మాధవి దంపతులకు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమం ఆసాంతం తెలుగు ఉపన్యాసకులు శ్రీ బి.వి. శక్తిధర్ గారు సభా నిర్వహణ చేయగా డాక్టర్ యల్. మృదుల గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణగారు అధ్యక్షత వహించారు. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగవిధానాలు ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని సాళ్వయోగి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో వివిధ ఆసనాలు వేయించి వాటిప్రయోజనాలను తెలియజేశారు. యోగప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతామని స్పష్టం చేశారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్గారు, శ్రీ టి.టి.అప్పారావుగారు యోగప్రాధాన్యతను వివరించారు.

జిల్లెళ్ళమూడి కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని సోదాహరణంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగాచార్యులు డా॥ కె. సత్యమూర్తి మాట్లాడుతూ అష్టాంగ యోగా విధానాలు ఆరోగ్యప్రదాయకమని తెలిపారు. శరీరాన్ని మనసుతో సమన్వయం చేసే ప్రక్రియ యోగా అని వివరించారు. ద్యాసే ధ్యానం అని, మౌనం అంటే సంకల్ప వికల్ప రహిత స్థితిలో ఉండడమని అమ్మ సూత్రీకరించినట్లు వివరించారు. ద్వంద్వమును ద్వంద్వముతో జయించటం యోగమని ద్వంద్వము నుండి ఏకత్వము సాధించటానికి యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ వేదికపై యోగా శిక్షకురాలు ఎమ్. వాహిని మాట్లాడుతూ ఆసనాలు ధ్యానం ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా తెలిపారు. వేదికపై విద్యార్ధినీ విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి అందరిని అలరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల సంస్కృత అధ్యాపకులు డా॥ ఎ. హనుమత్ ప్రసాద్ గారు స్వాగతం పలికి వివిధ అంశాలను వ్యాఖ్యానించి వందన సమర్పణ నిర్వహించారు. యోగసాధనను నిరంతర ప్రక్రియగా పాటించి ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతులుగా వర్థిల్లాలని కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు శ్వేత హితవు పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.