+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మార్చి 8 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన దేశం భారతదేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎ. సుధామ వంశీ అన్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్న ఆర్యోక్తిని వివరించి అమ్మ మహిళలు విద్యావంతులైతే సమాజ పురోగతిని సాధిస్తుందనే సదుద్దేశంతో కళాశాల స్థాపించిందని విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ సభలో కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను గౌరవించి వారి అభివృద్ధికి కారణాలు, తమకు ఎదురవుతున్న సమస్యలు విద్యార్థులతో వంచుకోవాలని ప్రిన్సిపాల్గారు కోరారు. డా॥యల్.మృదుల మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో పడిన కష్టాలను, తన విద్యాభ్యాసం, ఉద్యోగప్రస్థానం అన్నింటినీ చెప్పి అమ్మ దయవలనే కేవలం తను ఈ స్థితిలో ఉన్నానని అర్ద్రతతో కూడిన భక్తితో విద్యార్థులకు తన అనుభవాలు చెప్పారు. యమ్. కవిత మాట్లాడుతూ నేడు ప్రతి మహిళ అన్ని రంగాలలో ముందుంటుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఉండదు అని తాను తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు చెప్పి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. డా|| వి. పావని మాట్లాడుతూ ప్రకృతి, పురుషుడు అనేది విభాగమే కానీ. విభేదం లేదు. అది కేవలం నడవడం కోసమేనని రహస్యాన్ని తెలుసుకోగలిగితే విభేదం లేదని సృష్టి చెప్పారు. బాధ్యతతో కూడిన అధికారాన్ని మాత్రమే ఆశిస్తూ ప్రతి మహిళా ముందుకు వెళ్ళాలని హితవు పలికారు. రమ్య (లైబ్రేరియన్) మాట్లాడుతూ తాను ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాతకూడా తనకున్న ఆసక్తితో పై చదువులు చదవగలిగానని, తాను చదువుకోవడానికి శరశ్చంద్ర అన్నయ్యగారు ఎంతో ప్రోత్సహించారనీ గుర్తుచేసు కొన్నారు. ఇలా మహిళా దినోత్సవంనాడు మహిళా అధ్యాపకులకు ప్రత్యేక సభా నిర్వహణతో డా॥ ఎ. సుధామ వంశీ గారి అధ్యక్షతన ఆర్.వరప్రసాద్ గారి సభా నిర్వహణతో డా॥హనుమత్ ప్రసాద్ గారి ఛలోక్తులతో సభముగిసింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.