by MOC IQAC | Jul 3, 2025 | Drug Awareness, International Commemorative Days, Uncategorized
విద్యార్థుల సంక్షేమం, సమాజ పట్ల బాధ్యతను అవగాహన కల్పించేందుకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారు 26-06-2025 గురువారం EAGLE CLUB మరియు NSS UNIT సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేటూరు గ్రామ సచివాలయం మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి గారు విచ్చేసి మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, సమాజంపై ప్రభావం వంటి విషయాలను వివరించారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి, యువత మత్తుమందులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలన్న సందేశాన్ని ఇచ్చారు. సంస్కృత విభాగాధిపతి Dr. RVNSS వరప్రసాద్ గారు విద్యార్థులను ఉద్దేశించి భారతీయ జ్ఞానపరంపరలోని నైతిక విలువలు, మానసిక స్థైర్యం గురించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని NSS Convener శ్రీ T.జయకృష్ణ గారు నిర్వహించారు. NSS స్వచ్ఛంద సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొని మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఈ అవగాహనను పెంపొందించాలనే ప్రతిజ్ఞ చేశారు. శాంతిమంత్రం తో కార్యక్రమం ముగిసింది.

by MOC IQAC | Jun 21, 2025 | International Commemorative Days
యోగాంధ్ర కార్యక్రమం – సంక్షిప్త నివేదిక
(జూన్ 7 – జూన్ 21, 2025)
జూన్ 7 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం లో భాగంగా ప్రతిరోజూ ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల బాలికల మరియు బాలుర వసతి గృహాలలో యోగా సాధన చేయించారు. కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు యోగాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజున బాపట్ల నుండి వచ్చిన యోగా శిక్షకులు శ్రీ Ch.కేశవులు గారు విద్యార్థులతో యోగా సాధన చేయించారు.
తరువాత నిర్వహించిన సభలో SVJP TRUST Honorary Chairman శ్రీ M. దినకర్ గారు, Managing Trusty శ్రీ వల్లూరి ప్రేమ్ కుమార్ గారు పాల్గొన్నారు. శ్రీ వల్లూరి ప్రేమ్ కుమార్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని సంస్కృత విభాగాధిపతి శ్రీ ఆర్. వరప్రసాద్ నిర్వహించారు. చివరిగా యోగా శిక్షకులకు మరియు వారి బృందానికి యాజమాన్యం వారు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది. యోగా అనేది శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపేందుకు సాయంత్రం కళాశాల నుండి అధ్యాపకులు విద్యార్థులు జిల్లెళ్ళముూడి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామప్రజలకు యోగా గురించి అర్థమయ్యేలా వివరించి చెప్పారు. 15 మంది అధ్యాపకులు 142 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.


by MOC IQAC | Jun 5, 2025 | Awarness Programs, Environment, International Commemorative Days
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి NSS UNIT తరఫున అధ్యాపకులు మరియు విద్యార్థులు కలసి జిల్లెళ్ళమూడి గ్రామపరిసర ప్రాంతాలైన జమ్ములపాలెం, రేటూరు, కాకుమాను, అప్పాపురం, కర్లపాలెం,యాజలి గ్రామాలలోని అంగన్‌వాడి కేంద్రాలు, హైస్కూల్స్, పశువైద్యశాలల వద్ద పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నివారించి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగులు వాడుకోవాలని ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని సంరక్షించడం మన అందరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.
అదేవిధంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో Principal డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు, SVJP TRUST MANAGING TRUSTEE శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్, అధ్యాపకులు, విద్యార్థులు పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు.
కళాశాల క్యాంపస్ లో వివిధ రకాల మొక్కలను నాటడం ద్వారా హరిత శోభను పెంచారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.
by MOC IQAC | Mar 7, 2025 | International Commemorative Days
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది 7.3.2025 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభా కార్యక్రమం జరిగింది. ఈ సభకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ Dr. L. మృదుల అధ్యక్షత వహించారు. మహిళా సాధికారతను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ విశ్వవిద్యాలయం Assistant professor Dr. B. కామాక్షమ్మ గారు ఆన్లైన్ లో స్టూడెంట్స్ కి వేదకాలం మరియు నేటి కాలం యొక్క మహిళల గురించి వివరించారు. తెలుగు అధ్యాపకులు వీరాంజనేయులు గారు మహిళలను గురించిన ప్రేరణదాయకమైన గీతాన్ని ఆలపించారు. కళాశాల ప్రాచార్యులు Dr అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు ఆయా యుగాలలో జన్మించిన మహిళా మణులను వారి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సభకు ఆత్మీయ అతిథి Dr. J. Gnana prasuna గారు గొప్ప గొప్ప మహిళల గురించి వివరించారు. మహిళా దినోత్సవ సందర్భముగా జరిపిన రంగవల్లుల పోటీలలో విజేతలైన విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు బహుమతి ప్రదానం జరిగింది.
సంస్కృత అధ్యాపకులు డా. R.వరప్రసాద్ గారి పర్యవేక్షణలో కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక అధ్యాపకేతర మహిళామణులకు సన్మాన కార్యక్రమం జరిగింది, ఈ సభను ఆంగ్ల అధ్యాపకులు శ్రీమతి M. కవిత చక్కగా నిర్వహించారు, శాంతి మంత్రంతో సభ ముగిసింది.

by MOC IQAC | Feb 21, 2025 | International Commemorative Days
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభాకార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అయినాల మల్లేశ్వరరావు గారు గౌరవ అతిథి గా విచ్చేశారు. మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆంగ్లభాష ఉదరభాష మాతృభాష హృదయభాష అనీ, తల్లి ఒడిలో ఓనమాలు దిద్దిన వారు మాతృభాషను మరువరాదనీ అన్నారు. ఒక వ్యక్తి సంఘటిత శక్తి గా మారితే మాతృభాష పరిరక్షణ సుసాధ్యమని పలికారు. సహజకవి కావడంతో తమదైన శైలిలో సీస పద్యాలను ఆలపించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రష్ట్ సభ్యులు శ్రీ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భాషలకు సంబంధించిన ఉద్యమాలు గానీ భాషాబోధనలు కానీ టెక్నాలజీ తో కలిపి ముందుకు తీసుకువెళ్ళాలని అప్పుడే భాష గొప్పతనం అందరికీ చేరుతుందనీ సూచించారు.
సమైక్యభారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి. కన్నయ్య గారు మాట్లాడుతూ తెలుగువాడి ఉనికి యావద్భారతదేశం లోనూ కనిపిస్తుంది కానీ తెలుగువాడి శక్తి సత్తా మరింత చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదనీ తెలిపారు. 2000 సం లో తీసుకున్న నిర్ణయం తో సమైక్యభారతి ని ఏర్పాటు చేసి మాతృభాష పునరుద్ధరణ, కుటుంబవ్యవస్థ పరిరక్షణ లక్ష్యంగా నిర్విరామమైన కృషి చేస్తున్నామని వివరించారు. అంతేకాక మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి సంయుక్తంగా మాతృభాష ను పరిరక్షించడం లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగాధిపతి డా. యల్. మృదుల మరియు సంస్కృత శాఖాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు. విద్యార్థులు పద్యాల అంత్యాక్షరి తో నృత్యప్రదర్శనలతో మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు.
ఇదే వేదికపై నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల ఆటలపోటీలలో విజేతలకు అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ట్రోఫీలను, పతకాలను మరియు ధృవపత్రాలను అందించారు. తెలుగు ఉపన్యాసకులు జి. వీరాంజనేయులు గారు సభానిర్వహణ చేయగా జె. జయకృష్ణ గారు వందన సమర్పణ చేశారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by admin | Jun 21, 2024 | International Commemorative Days, Yoga
యోగేన యోగో జ్ఞాతవ్యో – యోగో యోగాత్ ప్రవర్తతే !
యో2ప్రమత్తస్తు యోగేన – స యోగీ రమతే చిరమ్ !!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం పక్షాన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో ప్రిన్పిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణం చేస్తూ యోగా అనేది మానసిక, శారీరక రుగ్మతలనుండి దూరం చేయగలదని వివరించారు. ముఖ్యంగా స్రీలకు వచ్చే అనారోగ్యాలు సులభమైన ఆసనాలతో నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి అనూష గారు అష్టాంగయోగాలను సవివరంగా తెలిపి ప్రత్యక్షంగా ఆసనాలు వేసి ప్రాణాయామాలలో రకాలను తెలిపి వాటిద్వారా అనేక రుగ్మతలకు ఉన్న నివారణోపాయాలను వివరించారు. నిత్యజీవితంలో యోగాతో అనుబంధం కలిగి ఉంటే రోగాలతో బంధ హీనులం కావచ్చని సూచించారు. ఆధునిక మానవ జీవన శైలి లో యోగాభ్యాసాన్ని అలవరచుకున్నట్లైతే చిరకాలం జీవించగలమన్నారు. హిస్టరీ ఉపన్యాసకులు శ్రీ పి. సుందరరావు గారు సభాసంచాలనం చేస్తూ యోగా ప్రత్యేకతను గుర్తించి గత పది సంవత్సరాలుగా అనేకవిధాలైన కాన్సెప్ట్ లతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ముదావహమని తెలిపారు. అనంతరం విద్యార్థుల యోగాసనాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.